ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఊసులెందుకో?

November 21, 2018


img

సిఎం కేసీఆర్‌ చాలా ఆచితూచి లెక్క ప్రకారం మాట్లాడుతారని అందరికీ తెలుసు. కనుక ఆయన మాట్లాడే మాటలలో పరమార్ధం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇవాళ్ళ దేవరకొండ బహిరంగసభలో ఆయన ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం, కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు. 

దేవరకొండ నియోజకవర్గంలో గిరిజనుల జనాభా ఎక్కువే కనుక వారిని ఆకట్టుకోవడానికే రిజర్వేషన్లు గురించి మాట్లాడి ఉండవచ్చు. గిరిజనులతో పాటు ముస్లింలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారు కనుక ఆ ప్రస్తావన చేసి ఉండవచ్చు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబందమూ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన పదేపదే చేయడం ఆలోచించవలసిన విషయమే. 

తెరాసకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ శత్రువు అని ప్రజలకు కూడా తెలుసు. కానీ బిజెపితో సంబందాల విషయంలోనే చాలా మందికి అనుమానాలున్నాయి. తెరాస సెక్యులర్ పార్టీయేని రాష్ట్రంలో ముస్లిం ప్రజలకు నమ్మకం కలిగించాలంటే మొదట బిజెపిపై గట్టిగా విమర్శలు చేయాలి. కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి రాజకీయ శత్రుత్వం ఉందో బిజెపితో కూడా ఉందని నిరూపించవలసి ఉంది. బహుశః అందుకే సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెపుతున్నారనుకోవచ్చు. 

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని లేకుంటే భూకంపం సృష్టిస్తానని చెప్పిన కేసీఆర్‌ దానికోసం సుమారు రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి డిల్లీకి పంపించేరు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి బిజెపి ఎలాగూ అంగీకరించదని సామాన్య ప్రజలకు కూడా తెలుసు కనుక కేసీఆర్‌కు అది తెలియదనుకోలేము. 

తాను ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేశానని కానీ కేంద్రం సహకరించలేదని చెపుతారని అప్పుడే అందరూ ఊహించారు. కేసీఆర్‌ ఇప్పుడు అదే చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు కనుక మరి కేసీఆర్‌ ముస్లింలకు రిజర్వేషన్లు ఏవిధంగా సాధించాలనుకొంటున్నారు? అని ప్రజలకు సందేహం కలుగవచ్చు. దానికి సమాధానమే ఊహాజనితమైన, ఆచరణ సాధ్యం కాని ఫెడరల్ ఫ్రంట్! అందుకే కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలలో ఆ ప్రస్తావన చేస్తున్నారని భావించవచ్చు. 


Related Post