వారసులు వెనక్కు తగ్గారు కానీ...

November 21, 2018


img

కాంగ్రెస్‌ అధిష్టానం ఈసారి మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డికె.అరుణ వంటి సీనియర్ నేతల కుమారులు, కుమార్తెలకు టికెట్లు నిరాకరించి, ఆ స్థానాలను మిత్రపక్షలకు కేటాయించింది. కాంగ్రెస్ అధిష్టానం తమతో ఇంత కటినంగా వ్యవహరిండాన్ని వారు జీర్ణించుకోవడం చాలా కష్టమే. వారిలో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయాలని ఆశపడిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ళ కార్తీక్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలతో పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి కాంగ్రెస్‌ జెండా దిమ్మెను పగులగొట్టించినప్పటికీ తన తల్లి కోసం వెనక్కు తగ్గక తప్పలేదు.

అలాగే  జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, డికె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి, కొండా సురేఖ కుమార్తె సుస్మితాపటేల్‌, షబ్బీర్‌ అలీ కుమారుడు ఇలియాస్‌ తదితలు టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలకు లోనైనప్పటికీ, తమ తల్లితండ్రుల కోసం వెనక్కు తగ్గి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.

అయితే శేరిలింగంపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడిన భిక్షమయ్య యాదవ్, వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నాయిని రాజేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలనుకొన్న క్రిషాంక్, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి, ఖైరతాబాద్ నుంచి క్యామ మల్లేశ్ గౌడ్ తదితరులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోబోమని  తెగేసి చెపుతున్నారు. 

ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం తన స్వంత పార్టీ నేతలను, వారి వారసులను కూడా పక్కనబెట్టి మిత్రపక్షాలలో గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయించింది. కానీ ఈ తిరుగుబాటు అభ్యర్ధుల కారణంగా వారు ఓడిపోయినట్లయితే మహాకూటమి ప్రయోగం విఫలమవుతుంది.

రేపటితో నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. కనుక ఆలోగా వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకొనేలా చేయడానికి కాంగ్రెస్‌ పెద్దలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు.


Related Post