ఆ రెండు పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదు?

November 21, 2018


img

ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికలలో పోటీ చేసి గెలిచి అధికారంలోకి రావడమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఈసారి పోటీ చేయడంలేదు. కనుక ఇన్నేళ్ళుగా ఆ పార్టీనే నమ్ముకొన్న నేతలు డమ్మీ రాజకీయ నాయకులుగా మిగిలిపోయారు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా  మారింది. 

ఇక జనసేన పార్టీ, గత ఎన్నికలలో టిడిపి-బిజెపి కూటమికి మద్దతు ప్రకటించి ఎన్నికల పోటీ చేయకుండా తప్పించుకొంది. కానీ ఈసారి ఆ రెండు పార్టీలకు దూరం అయ్యింది. పైగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. అయినప్పటికీ జనసేన పార్టీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్దంగా లేకపోవడం వలననే పోటీ చేయలేకపోయామని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకొన్నారు. 

అయితే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దీనినే మరో కోణంలో చూపిస్తున్నారు. బిజెపి-తెరాస-జనసేన-వైకాపా నాలుగు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే ఆ రెండు పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం లేదని ఆరోపించారు. ఆ నాలుగు పార్టీలు పరస్పరం ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేసుకోకుండా కేవలం తనను, తన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేయడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ప్రతినిధిగా నిలబడే టిడిపి తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేస్తోందని చంద్రబాబు అన్నారు.


Related Post