మరో కొత్త హామీ ప్రకటించిన ఉత్తమ్

November 21, 2018


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాల మాఫీ, పెన్షన్లు రెట్టింపు చేయడం వంటి హామీలను ప్రకటించి తెరాసకు సవాలు విసిరినప్పుడు, మంత్రి కేటిఆర్‌తో సహా తెరాస నేతలు అవి ఆచరణ సాధ్యం కానీ హామీలని, వాటితో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గట్టిగా వాదించారు. కానీ ప్రజలు ఆ హామీలకు ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని గ్రహించిన తెరాస కూడా నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి, పెన్షన్, ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించక తప్పలేదు.         

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెరాసపైకి మరోకొత్త అస్త్రాన్ని సందించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఎంపికైన లబ్దిదారులందరికీ వాటిని అందజేసేవరకు లబ్దిదారులు అద్దె ఇళ్ళలో ఉంటారు కనుక వారికి ఏడాదికి రూ.50,000 అద్దె చెల్లిస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. 

అలాగే గతంలో ఇందిరమ్మ ఇళ్ళు పొందిన లబ్దిదారులకు అదనపు గది, మరుగుదొడ్డి వగైరాలు నిర్మించుకొనేందుకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే తెరాస ప్రభుత్వం త్రోక్కి పట్టి ఉంచిన ఇందిరమ్మ ఇళ్ళు పెండింగ్ బిల్లులకు చెల్లింపులు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 

ఈ హామీలో సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, ఇది ఖచ్చితంగా తెరాసను ఇరకాటంలో పెట్టేదేనని చెప్పవచ్చు. ఒకవేళ తెరాస కూడా దీనికి తగ్గట్లుగా హామీ ఇవ్వకపోతే, రాష్ట్రంలో నిర్మితమవుతున్న 2.76 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఎంపికయిన లబ్దిదారులు, ఇందిరమ్మ ఇళ్ళు పొందినవారు వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. కనుక తెరాస కూడా తన మేనిఫెస్టోలో ఈ కొత్త హామీని చేర్చక తప్పదేమో? 


Related Post