శంకరమ్మకు నో ఛాన్స్

November 15, 2018


img

బుదవారం రాత్రి తెరాస ప్రకటించిన 10 మంది అభ్యర్ధుల జాబితాలో హుజూర్ నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న కాసోజు శంకరమ్మ, ఖైరతాబాద్ నుంచిటికెట్ ఆశిస్తున్న మన్నే గోవర్ధన్ రెడ్డి పేర్లు లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనవడం ఖాయం. తనకు టికెట్ కేటాయించకపోతే తెలంగాణభవన్‌ ముందే ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని శంకరమ్మ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె హుజూర్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇక మన్నే గోవర్ధన్ రెడ్డి అనుచరులు గత నాలుగు రోజులుగా తెలంగాణభవన్‌ ముందు తమ నాయకుడికే టికెట్ ఇవ్వలంటూ ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది. చిరకాలంగా తెరాసలో పనిచేస్తున్న తనను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన దానం నాగేందర్ కు టికెట్ కేటాయించడాన్ని గోవర్ధన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. తెరాస ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. అవి ఫలించకపోతే ఆయన కూడా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి అన్ని పార్టీలు పోటీ పడుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దాసోజు‌శ్రవణ్‌కుమార్‌, బిజెపి సీనియర్ నేత సిహెచ్. రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కనుక వారిని డ్డీకొని గెలవాలంటే ఆ నియోజకవర్గంపై మంచి పట్టున్న దానం నాగేందర్ సరైన వ్యక్తి అని సిఎం కేసీఆర్‌ భావించి ఉండవచ్చు. 

ఇక హుజూర్ నగర్ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆయనపై శంకరమ్మ వంటి బలహీన అభ్యర్ధిని నిలబెడితే ఆ సీటును చేజేతులా కాంగ్రెస్ పార్టీకి సమర్పించుకొన్నట్లవుతుంది. అందుకే రెడ్డి సామాజిక వర్గానికే చెందిన శానంపూడి సైదిరెడ్డిని బరిలో దింపినట్లు భావించవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి బిఎల్ఎఫ్ కూటమిలో సిపిఎం అభ్యర్ధిగా శేఖర్ రావు, బిజెపి అభ్యర్ధిగా భాగ్యరెడ్డి పోటీ చేస్తున్నారు.


Related Post