మహాకూటమిపై చెరుకు సుధాకర్ విమర్శలు

November 15, 2018


img

నిన్నటి వరకు మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు లభించకపోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆ పార్టీ నేత జస్టిస్ చంద్రకుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మేము కేవలం మూడు సీట్లు అడిగాము. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే ఇస్తానని చెప్పినా అంగీకరించాము. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. మహాకూటమిలో అభ్యర్ధుల జాబితాలు అటు డిల్లీలో, ఇటు అమరావతిలో ఖరారు అవుతున్నాయి. అందుకే మహాకూటమిలో కూడా మావన్తి ఉద్యమకారులకు న్యాయం జరుగలేదు. కాంగ్రెస్, తెరాస రెండు పార్టీలు కూడా ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా ద్రోహం చేశాయి. త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరివి అన్నట్లు సాగుతోంది వాటి వ్యవహారం. సిపిఐ, టిజేఎస్, కాంగ్రెస్ పార్టీలు మూడు ఒక బలమైన సామాజిక వర్గం నేతల చేతిలో ఉన్నాయి. అందుకే    మహాకూటమిలో కనీసం సామాజిక న్యాయం కూడా పాటించకుండా అగ్రకులాల నేతలు టికెట్లు కేటాయించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యకు కూడా టికెట్ కేటాయించలేదు. ఇక మాకేమీ న్యాయం చేస్తుంది? మహాకూటమిని, తెరాసను మేము ఎన్నికలలో తప్పకుండా ఎదుర్కొంటాము,” అని చెరుకు సుధాకర్ అన్నారు.

మహాకూటమిలో నాలుగు పార్టీలు బలమైన సామాజిక వర్గం నేతల చేతిలో ఉన్న మాట వాస్తవం. కనుక టికెట్ల కేటాయింపులో ఆ వర్గం ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు కేటాయించకపోవడానికి కారణం మాత్రం అదికాదని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకే చెందిన చిరుమర్తి లింగయ్య ఆ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టారు. కాంగ్రెస్‌ నేతలను కాదని కొత్తగా వచ్చిన ఇంటిపార్టీకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి నల్గొండ జిల్లాలో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంటి పార్టీకి కాంగ్రెస్‌ హ్యాండ్ ఇచ్చిందని చెప్పవచ్చు. 

టిజేఎస్, టిడిపి సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటోంది. కానీ వాటికి తెలంగాణలో ఎంతో కొంత స్వంత బలం ఉన్నందున పార్టీలో అంతర్గతంగా ఒత్తిళ్ళు, వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ వాటికి సీట్లు కేటాయించిందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్‌ పార్టీ కట్టుకొన్న ఈ లెక్కలు ఫలిస్తాయో లేదో ఎన్నికల ఫలితాలు వెలువడితే కానీ తెలియదు.


Related Post