కాంగ్రెస్‌లో పొగలు గ్రక్కుతున్న అసమ్మతి సెగలు

November 13, 2018


img

కాంగ్రెస్ పార్టీ 65 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేయగానే ఊహించినట్లుగానే టికెట్ లభించని నేతలు పార్టీపై మండిపడుతున్నారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించిన భిక్షపతి యాదవ్, నాయిని రాజేందర్ రెడ్డి (వరంగల్ పశ్చిమ) సుద్దాల దేవయ్య (చొప్పదండి), కృషాంక్ (కంటోన్మెంట్‌), మానవతారయ్‌( సత్తుపల్లి) వంటి అనేకమంది కాంగ్రెస్‌ నేతలు పార్టీకి రాజీనామా చేయడమో లేక స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయడానికో సన్నాహాలు చేసుకొంటున్నారు. 

కాంగ్రెస్‌ తొలి జాబితాలో మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వంటి సీనియర్ నేతల పేర్లు కనబడకపోవడంతో వారు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇక జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డికి టికెట్లు లభించకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇవాళ సాయంత్రంలోగా కాంగ్రెస్‌ అధిష్టానం రెండవ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా విడుదలైతే ఇంకా ఎంతమంది సీనియర్లకు ఈసారి కాంగ్రెస్‌ అధిష్టానం పక్కన పెట్టిందో తెలుస్తుంది. 

నామినేషన్లు వేసే ముందు కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న ఈ అసంతృప్తి జ్వాలలు చూస్తున్నప్పుడు, రెండు నెలల క్రితమే తెరాస 105 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేయడం చాలా మంచి నిర్ణయమని అర్ధమవుతోంది. ఈ రెండు నెలల కాలంలో టికెట్ లభించని వారిని బుజ్జగించడానికి, తిరుగుబాటు చేసినవారిపై వేటు వేసి ఆ లోటును వేరేవారితో భర్తీ చేసుకోవడానికి తెరాస చాలా సమయం లభించడంతో, కీలకమైన ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా తాపీగా, ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకోగలుగుతోంది. కానీ ఇంతకాలం మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లపై చర్చోపచర్చలు జరుపుతూ కాలక్షేపం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకవైపు పార్టీలో అసమ్మతివాదులతో, మరోపక్క మిత్రపక్షాలతో పట్లు పడుతూ ఎన్నికలను ఎదుర్కోవలసివస్తోంది. 


Related Post