తెరాసకు బొడిగే శోభ గుడ్ బై?

November 12, 2018


img

తెరాస చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ రేపు తెరాసకు గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. మొదటి జాబితాలో ఆమె పేరు లేకపోయినప్పటికీ నేటి వరకు ఆమె చాలా ఓపికగా టికెట్ కోసం ఎదురుచూశారు. కానీ నామినేషన్ల కార్యక్రమం కూడా మొదలయిపోవడంతో ఆమెలో సహనం నశించినట్లుంది.

పైగా తెరాస రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకే రవిశంకర్ చొప్పదండి నుంచి తెరాస అభ్యర్ధిగా తానే పోటీ చేయబోతున్నానంటూ జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటుండటంతో శోభ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు టికెట్ ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని ఆమె మద్యవర్తుల ద్వారా తెరాస అధిష్టానానికి కబురు పంపారు కానీ అటువైపు నుంచి స్పంధన రాకపోవడంతో ఇక తనకు టికెట్ రాదని భావించిన ఆమె బిజెపిలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేసుకొన్నారని సమాచారం.

మంగళవారం ఉదయంలోగా తెరాస నుంచి కబురు రానట్లయితే, ఆమె మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. 

ఆమెకు తెరాస టికెట్ లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను పార్టీలోకి ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికే ఇంతవరకు టికెట్లు కేటాయించలేక తలపట్టుకొంటున్న ఈ చివరి నిమిషంలో ఆమెను పార్టీలోకి ఆహ్వానించినా ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా అంటే అనుమానమే. అందుకే ఆమె బిజెపివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.


Related Post