కేంద్రంలో కీలక పాత్ర అంటే?

November 12, 2018


img

కొన్ని నెలల క్రితం సిఎం కేసీఆర్‌ ‘జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తా’నంటూ చాలా హడావుడి చేశారు. కానీ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన కలిసిన నేతలందరూ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో కేసీఆర్‌ సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత ఫ్రంట్ ఏర్పాటు గురించి తెరాసలో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇటీవల ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసెంబ్లీ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. నిన్న తెలంగాణభవన్‌లో పార్టీ అభ్యర్ధులకు బి-ఫారంలు అందజేస్తున్నప్పుడు సిఎం కేసీఆర్‌ కూడా మళ్ళీ అదే మాట చెప్పారు. 

కనుక కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తానంటే అర్ధం ఏమిటి?మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకొంటారా? లేక ఎన్డీయే కూటమిలో చేరి కేంద్రమంత్రి పదవి తీసుకొంటారా?అనే సందేహాలు కలుగుతాయి. 

ప్రస్తుతం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బిజెపిని, నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షపార్టీలన్నీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనుక కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. అలాగని చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌ కూటమిలో చేరలేరు. కారణాలు అందరికీ తెలుసు. 

కనుక చంద్రబాబుతో కలువకుండా, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయకుండా కేసీఆర్‌ కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పగలరు? అని ఆలోచిస్తే ఎన్డీయే కూటమిలో చేరడం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుందని అర్ధం అవుతుంది. ఒకవేళ కేసీఆర్‌ చెపుతున్నట్లు రాష్ట్రంలో తెరాసకు 100 పైగా సీట్లు లభించినట్లయితే తన కుమారుడు కేటిఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. మార్చిలో జరిగే లోక్ సభ ఎన్నికలలోగా ‘కేటిఆర్‌ ప్రభుత్వం’ కుదురుకొంటుంది. అప్పుడు కేసీఆర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ లోక్ సభకు పోటీ చేసి, తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చి తాను కేంద్రమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్నారేమో? 

కానీ ‘కేంద్రంలో కీలకపాత్ర పోషించడం’ అంటే కేంద్రమంత్రి పదవి చేపట్టడమే అని అనుకోలేము. కనుక లోక్ సభ ఎన్నికల తరువాత మోడీ, కేసీఆర్‌ కలిసి కొత్తగా ఏమైనా చేయబోతున్నారా?అనే సందేహం కలుగుతోంది. 

ఒకవేళ ఈసారి లోక్ సభ ఎన్నికలలో బిజెపి ఓడిపోయి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే ఆలోచనలు విరమించుకొని తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అవుతారేమో? 


Related Post