దటీజ్ కేసీఆర్‌!

November 12, 2018


img

మూడు నెలల క్రితం సిఎం కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసురుతూ ‘ముందస్తు ఎన్నికలకు వెళదామా?’ అంటూ సరదాగా సవాలు విసిరారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన ఆ మాటనే నిజం చేసి చూపారు. సెప్టెంబరు 6వ తేదీన శాసనసభను రద్దు చేసి అదే రోజున 105 మంది అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసి ఒక సంచలనం సృష్టించారు.

మొదటి నుంచి చెపుతున్నట్లుగానే వారిలో 103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఖరారు చేసి కేసీఆర్‌ తన మాట నిలుపుకొన్నారు. అయితే తొలిజాబితాపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరి నిమిషంలోగా ఆ జాబితాలో చాలా మంది పేర్లు మారవచ్చునని ప్రతిపక్షపార్టీలు, మీడియా భావించాయి. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. 

టికెట్లు లభించని కొండా సురేఖ, నల్లా ఓదెలు వంటివారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. స్టేషన్ ఘన్‌పూర్‌, చెన్నూరు, వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో చెలరేగిన నిరసనజ్వాలలు అందరూ చూశారు. వారి ఒత్తిళ్లకు తలొగ్గి సిఎం కేసీఆర్‌ తొలి జాబితాలో అభ్యర్ధుల పేర్లను మార్చుతారనే ఊహాగానాలు వినిపించాయి.  

మొదటి జాబితాలో ప్రకటించిన 105 మంది అభ్యర్ధులలో కనీసం 30-40 మంది పేర్లు మార్చవచ్చునని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ పార్టీలో ఎంత అసంతృప్తి సెగలు రగిలినా వారిలో ఒక్కరి పేరు కూడా మార్చకుండా కేసీఆర్‌ తన మాటకు కట్టుబడి ఉన్నారు. చూస్తుండగానే రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ముందే చెప్పినట్లుగా సిఎం కేసీఆర్‌ స్వయంగా నిన్న 106 మంది అభ్యర్ధులకు బి-ఫారంలు ఇచ్చేశారు. 

దీని వలన తెరాస అభ్యర్ధులలో, ప్రజలలో ఆయన మాట నిలబెట్టుకొంటారనే నమ్మకం పెరిగింది. అలాగే ఆయన తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎట్టి పరిస్థితులలో ఎన్నికలలో గెలవాలనే తపన, పట్టుదల తెరాస అభ్యర్ధులలో బాగా పెరిగాయని చెప్పవచ్చు. నాయకుడి పట్ల సైన్యానికి, సైన్యం పట్ల నాయకుడికి పరస్పర నమ్మకం ఇంత బలంగా ఉంటే యుద్ధానికి బయలుదేరే ముందే సగం విజయం సాధించినట్లు భావించవచ్చు. 


Related Post