నకిరేకల్ సీటు మాకే: చెరుకు సుధాకర్

November 10, 2018


img

ఒకపక్క మహాకూటమిలో టిజేఎస్, సిపిఐ పార్టీలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోలేక తలపట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, చేజేతులా మరో పెద్ద సమస్యను ఆహ్వానించుకొంటున్నట్లుంది. 

నల్గొండ జిల్లాలో నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకొని కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. నకిరేకల్ సీటును కాంగ్రెస్‌ నేత చిరుమర్తి లింగయ్యాకే కేటాయించాలని, ఇంటి పార్టీకి కేటాయిస్తే తామిద్దరం ఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటించారు. అంతేకాదు...పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఇద్దరినీ ఓడిపోవలసి వస్తుందని హెచ్చరించారు. 

కనుక ఈవిషయంలో కాంగ్రెస్‌ పార్టీ పునరాలోచిస్తుందని భావిస్తుంటే, శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన మహాకూటమి నేతల సమావేశానికి తెలంగాణ హాజరైన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ పార్టీని మూడు స్థానాలు కోరగా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సీటు ఇవ్వడానికి అంగీకరించింది, అక్కడి నుంచి నా భార్య చెరుకు లక్ష్మి పోటీ చేస్తుంది,” అని చెప్పారు. 

ఇక మరో విశేషమేమిటంటే, ఈరోజు గాంధీ భవన్‌ వద్ద జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన దీక్షలలో పాల్గొన్న ప్రసన్నరాజ్‌ నకిరేకల్‌ టిక్కెట్‌  తనకే ఇవ్వాలంటూ తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కోమటిరెడ్డి సోదరులు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు బెదిరించడం సరికాదు. కాంగ్రెస్ పార్టీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తావు లేదు. నకిరేకల్ సీటు తప్పకుండా నాకే కేటాయిస్తారని నమ్ముతున్నాను,” అని అన్నారు.

ప్రసన్నరాజ్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. కనుక కోమటిరెడ్డి సోదరులకు జవాబు చెప్పేందుకే ప్రసన్నరాజ్‌ గాంధీ భవన్‌కు రప్పించబడ్డారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

చెరుకు సుధాకర్ చేసిన తాజా ప్రకటనతో నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అలజడి మొదలైంది. దీనిపై కోమటిరెడ్డి సోదరులు ఇంకా స్పందించవలసి ఉంది.


Related Post