జనసేన ఎప్పటికీ రెడీ అవుతుందో?

November 10, 2018


img

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగినట్లయితే తెలంగాణలో మేము 23 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకొన్నాము కానీ తెలంగాణలో  ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలు రావడంతో వాటిని ఎదుర్కొనేందుకు మా పార్టీ సిద్దపడలేకపోయింది. స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగాలనుకొంటున్న కొందరు మా మద్దతు కోరుతున్నారు. కనుక ఈ అంశంపై మా పార్టీలో చర్చించుకొని ఒకటి రెండు రోజులలో మా నిర్ణయం ప్రకటిస్తాము,” అని చెప్పారు. 

గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టి చాలా హడావుడి చేసిన పవన్ కల్యాణ్ అప్పుడూ ఆఖరు నిమిషంలో కుంటిసాకులు చెపుతూ బరిలో నుంచి తప్పుకొన్నారు. ఈసారి ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తామంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ సుమారు ఏడాది క్రితమే సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాలలో ప్రవేశించారు. అప్పటి నుంచి తెలంగాణలో పార్టీని సిద్దం చేసుకొంటూ, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించుకొంటున్నారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి వాటిని ఎదుర్కోవడానికి ఇంకా సిద్దంగా లేమని పవన్ కల్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ తెరాసను చూసి భయపడుతున్నారా? లేక పోటీ చేసినా డిపాజిట్లు దక్కవనే ఆలోచనతో ఎన్నికలకు దూరంగా ఉండాలనుకొంటున్నారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో పోటీ చేసే ఆలోచన లేదనట్లే పవన్ కళ్యాణ్ మాట్లాడారు కనుక సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ కు మద్దతు ప్రకటించి చేతులు దులుపుకొంటారేమో? ఇంతకీ జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఇంకా ఎన్నేళ్లు సమయం కావాలో? 


Related Post