కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా నేడు ప్రకటిస్తామన్న కుంతియా ప్రకటనపై మహాకూటమిలో మిత్రపక్షాలే కాకుండా కాంగ్రెస్, టిడిపిలలో ఆశావాహులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి అనుచరులు పార్టీ ప్రధాన కార్యాలయాలకు చేరుకొని తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల నుంచి గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలతో హోరెత్తిపోతుంటే, ఈరోజు ఉదయం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ వద్ద కూడా నిరసనలు మొదలయ్యాయి.
గత ఎన్నికలలో ఎల్బీ నగర్ నుంచి టిడిపి తరపున ఆర్.కృష్ణయ్య పోటీ చేసి గెలిచారు. ఆయన టిడిపికి దూరం అయ్యారు కనుక ఆ సీటును సామరంగారెడ్డికి కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ధర్నా చేస్తున్నారు. సామరంగారెడ్డి టిడిపికి కష్టకాలంలో అంటిపెట్టుకొని ఉంటూ పార్టీ క్యాడరును కాపాడుకొన్నారని కనుక ఈసారి ఎన్నికలలో ఆయనకే ఎల్బీ నగర్ టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల భాగంగా ఎల్బీ నగర్ టికెట్ ను కాంగ్రెస్ లేదా మరో పార్టీకి కేటాయిస్తే సహించబొమని హెచ్చరిస్తున్నారు.
ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత హరినాయక్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని టిడిపి నుంచి వచ్చిన రమేశ్ రాథోడ్ కు కేటాయించబోతున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో అజ్మీరా నాయక్ అనుచరులు గాంధీ భవన్ వద్దకు చేరుకొని నిరాహార దీక్ష చేపట్టారు. పేరాచూట్ వేసుకొని ఎన్నికలకు ముందు పార్టీలో దిగిన రమేశ్ రాథోడ్ కు టికెట్ ఇస్తే సహించబోమని, తమ నాయకుడు అజ్మీరా నాయక్ కు తప్పనిసరిగా ఖానాపూర్ టికెట్ ఇవ్వవలసిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మహాకూటమిలో టిజేఎస్, సిపిఐ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తరువాత అలకలు, బుజ్జగింపులు, ఫిరాయింపుల హడావుడి ఉండనే ఉంటుంది.