తెలంగాణతో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగబోతున్న నేపద్యంలో వివిద సర్వే సంస్థలు తమ నివేదికలు ప్రకటిస్తున్నాయి. తాజాగా సి-ఓటర్ సంస్థ తన సర్వే నివేదికను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమికి విజయావకాశాలు ఉన్నాయని తెలిపింది. మహాకూటమి 64 సీట్లు, తెరాస-42, బిజెపి-4, ఇతరులకు 9 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా మహాకూటమికి 33.9 శాతం ఓట్లు, తెరాస-29.4 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. మహాకూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని పేర్కొంది.
ఇక కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకొంటున్నవారు 42.90 శాతం, జానారెడ్డి-22.60, రేవంత్‌రెడ్డి-7.20 శాతం ఉన్నారని పేర్కొంది.
అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను వాస్తవదృష్టితో నిష్పక్షపాతంగా చూసినట్లయితే, అసెంబ్లీ ఎన్నికలలో మూడు రకాల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు. 1. తెరాస 100కు పైగా సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి రావడం. 2. తెరాస బొటాబోటి మెజార్టీతో అధికారంలోకి రావడం. 3. మహాకూటమికి, తెరాసకు పూర్తిమెజార్టీ లభించక హంగ్ అసెంబ్లీ ఏర్పడటం.
తెరాస విజయావకాశాలకు బలమైన కారణాలు కళ్లెదుటే కనబడుతున్నాయి.
1. సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేసి తెరాస అభ్యర్ధుల జాబితాను ప్రకటించినప్పటి నుంచి వారు తమతమ నియోజకవర్గాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఇప్పటికే తమవైపు తిప్పుకోగలిగారు. త్వరలో సిఎం కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెడితే తెరాసకు ఇంకా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
2. తెరాస ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పధకాలే దానికి శ్రీరామరక్ష. రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు వాటిలో ఏదో ఒక పధకం లబ్దిదారుడేనంటే అతిశయోక్తి కాదు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి మంత్రులు, తెరాస అభ్యర్ధులు చాలా చక్కగా ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకొంటున్నారు.
3. తెలంగాణ ఏర్పడక మునుపు, ఏర్పడిన తరువాత నాలుగేళ్లలో ప్రతీ జిల్లా, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెరాస నేతలు చక్కగా వివరిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.
4. మహాకూటమికి చంద్రబాబు నాయుడును ముడిపెట్టి తెరాస నేతలు చేస్తున్న ప్రచారం.
5. మహాకూటమిలో సీట్ల కోసం కీచులాటలు.
6. మహాకూటమిలో కేసీఆర్ వంటి బలమైన ముఖ్యమంత్రి అభ్యర్ధి (ప్రకటించ)లేకపోవడం.
ఇక హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి గల కారణాలను చూసినట్లయితే,
1. మహాకూటమిలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ పార్టీలలో సీనియర్ నేతల నుంచి తెరాసకు గట్టి పోటీ ఉండటం.
2. ఎటువంటి కారణమూ లేకుండా తొమ్మిది నెలలు ముందుగా శాసనసభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళుతున్నందున తెరాసపై ప్రజలలో వ్యతిరేకత.
3. కేసీఆర్ నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడల పట్ల ప్రజలలో అసంతృప్తి.
4. ఏపీ సిఎం చంద్రబాబునాయుడు పట్ల అనుచిత బాషలో విమర్శలు చేయడం, సీమాంధ్రులను తెరాస కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తుండటం వలన వారిలో నెలకొన్న అసంతృప్తి మహాకూటమికి అనుకూలంగా మారే అవకాశం.
5. మిషన్ భగీరధ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి హామీల అమలులో తెరాస సర్కార్ వైఫల్యాలు.
కనుక ఈసారి ఎన్నికలలో సిఎం కేసీఆర్ చెప్పినట్లుగా తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకొని మహాకూటమిని మట్టికరిపించడమో లేక బొటాబోటి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రావడమో జరుగవచ్చు. లేకుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చు తప్ప సి-ఓటరు చెపుతున్నట్లు మహాకూటమి 64 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావడం కష్టమేనని చెప్పవచ్చు.