బాబును వేలు పెట్టనీయము: జానారెడ్డి

November 09, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత కె. జానారెడ్డి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రాజేసి ఎన్నికలలో నెగ్గాలని కేసీఆర్‌ చూస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మహాకూటమిలో రాజకీయపార్టీలు పొత్తులు పెట్టుకొంటే వాటికీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ముడిపెట్టాలని కేసీఆర్‌ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ రెండు వేర్వేరు అంశాలని ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మా అధిష్టానంతోనే పోరాడిన మేము, దానికి భంగం కలుగుతుందనుకొంటే చంద్రబాబుతో పోరాడలేమా? ఆయన జాతీయస్థాయిలో రాజకీయ మార్పు కోసమే మాతో పొత్తులకు సిద్దపడ్డారు తప్ప మా అంతట మేము ఆయన వద్దకు వెళ్ళలేదని అందరికీ తెలుసు.

మహాకూటమిలో నాలుగు పార్టీలు పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తుంటే ఏదో అనర్ధం జరిగిపోతుందన్నట్లు మాట్లాడుతున్న కేసీఆర్‌, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల నాయకులతో చేతులు కలపడానికి వెళ్ళిన సంగతి అప్పుడే మరిచిపోయారా?

రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిపోతుందని తెరాస నేతల వాదన చాలా అర్ధరహితంగా ఉంది. ఒకవేళ చంద్రబాబు నిజంగా అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ముందుగా మేమే ఆయనను అడ్డుకొంటాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే మహాకూటమిని ఏర్పాటు చేసుకొన్నాము తప్ప తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరికో తాకట్టు పెట్టాలని కాదు,” అని అన్నారు.


Related Post