సీమాంధ్రుల ఓట్లు ఎవరికి?

November 09, 2018


img

తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్లు ఈసారి ఎవరికి పడతాయి? అనే ప్రశ్నకు అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు తమకే పడతాయని గట్టిగా వాదిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరిన దానం నాగేందర్ ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ, “గ్రేటర్ ఎన్నికలలోనే సీమాంధ్రులు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా తేలిపోయింది. కానీ వారందరూ గంపగుత్తగా కాంగ్రెస్, టిడిపిలకే ఓట్లు వేసేస్తారని ఆ పార్టీలు భ్రమలో ఉన్నాయి. అయితే సీమాంధ్రులకు ఆ రెండుపార్టీలు ఏమిచేశాయని వాటికి ఓట్లు వేయాలి?వారికి కావలసింది తమ ధనమానప్రాణాలకు రక్షణ. అది మా ప్రభుత్వం కల్పిస్తోంది. కనుక వారు మా పార్టీకే ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికలలో మహాకూటమికి గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు. 

అయితే సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఆ పార్టీ నేతలు ఏపీ సిఎం చంద్రబాబునాయుడుపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, చేస్తున్న తీవ్ర ఆరోపణలు సీమాంధ్రులలో తెరాస పట్ల ఎంతో కొంత వ్యతిరేకతను కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. ఇటీవల మంత్రి కేటిఆర్‌ హైదరాబాద్‌లోని ఆంధ్రా అసోసియేషన్స్ సభ్యులు, నేతలతో సమావేశమైనప్పుడు వారీలో కొందరు నేరుగా ఆ మాట కేటిఆర్‌కే చెప్పారు. వారికి ఆయన ఏదో సర్దిచెప్పాలని ప్రయత్నించారు కానీ వారు తెరాస వైఖరి పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. 

హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు టిడిపి, వైకాపాల మద్య చీలిపోయుండవచ్చు. కనుక వారిలో వైకాపాకు అనుకూలంగా ఉన్నవారు తెరాసకు, మిగిలిన వారు కాంగ్రెస్, టిడిపి పార్టీలకు ఓట్లు వేసే అవకాశం ఉంది. సిఎం కేసీఆర్‌కు ఇది తెలియకనే చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని వ్యూహాలు రచించారనుకోలేము. తెలంగాణ ప్రజల మెజార్టీ ఓట్లతో పోలిస్తే సీమాంద్రుల ఓట్ల శాతం చాలా తక్కువే కనుక మెజార్టీ ఓట్లను దక్కించుకోవడానికి ఆ మాత్రం రిస్క్ తీసుకోవచ్చుననే ఉద్దేశ్యంతోనే ‘టార్గెట్ చంద్రబాబునాయుడు వ్యూహం’ రూపొందించినట్లు భావించవచ్చు. 

కానీ అంతా మాత్రన్న సీమాంధ్ర ఓటర్లను మహాకూటమికి వదిలిపెట్టేయలేదు. తెరాస మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సీమాంధ్రుల సంఘాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక రాష్ట్రంలో సీమాంధ్రులు ఎటువైపు మొగ్గుతారో తెలియాలంటే డిసెంబరు 11వరకు వేచి చూడవలసిందే. 


Related Post