తెరాసలో చిచ్చుకి రేవూరి ప్రయత్నాలు...ఫలించేనా?

November 09, 2018


img

తెరాస నేతలు టిడిపి అధినేత, ఏపీ సిఎం చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తుండటంతో, టిడిపి నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా తెరాసపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలలాగా ఆయన తెరాసపై అవినీతి ఆరోపణలు చేసినట్లయితే, వాటికి తెరాస నేతలు ధీటుగా జవాబు చెప్పి ఉండేవారు. కానీ రేవూరి ఎంచుకొన్న అంశం చాలా సున్నితమైనది కావడంతో తెరాసలో ఎవరూ దానిపై మాట్లాడలేకపోతున్నారు. 

సిఎం కేసీఆర్‌ మంత్రి హరీష్ రావుకు ప్రాధాన్యతనివ్వకుండా తన కొడుకు మంత్రి కేటిఆర్‌ను తన కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రేవూరి ఆరోపిస్తున్నారు. ఆ కారణంగా మంత్రి హరీష్ రావు లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని రేవూరి వాదిస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ వెంట నడుస్తున్న మంత్రి హరీష్ రావును కాదని, కేటిఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని రేవూరి అన్నారు. సిఎం కేసీఆర్‌ మంత్రి హరీష్ రావును మెల్లగా పక్కకు తప్పించి, తన కొడుకును సిఎం చేయాలనుకొంటున్నారని అందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని రేవూరి ఆరోపించారు. ఒకవేళ మంత్రి కేటిఆర్‌కు సిఎం పదవిపై నిజంగా ఆసక్తి లేదంటే, మంత్రి హరీష్ రావు కేసీఆర్‌ వారసుడని ప్రకటించాలని రేవూరి సవాలు విసిరారు.

మరో 10-15 ఏళ్ళు వరకు సిఎం కేసీఆరే మా ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రులు కేటిఆర్‌, హరీష్ రావు ఇద్దరూ చాలాసార్లు చెప్పారు. కనుక ఆ పదవి గురించి ఎవరూ ఆలోచించనవసరమే లేదని వారు స్పష్టం చేశారు. నిజానికి ఇది తెరాస అంతర్గత వ్యవహారం. దానిలో టిడిపి వేలుపెట్టనవసరం లేదు. కానీ ముందే చెప్పుకొన్నట్లు తెరాస చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని తీవ్రవిమర్శలు చేస్తుండటంతో రేవూరి కూడా దీనితో తెరాసపై ఎదురుదాడి చేస్తున్నారని చెప్పవచ్చు. 

తెరాసలో అంతర్గత వ్యవహారాలను ప్రశ్నిస్తే వారు కూడా టిడిపిలో నారా లోకేశ్ కోసం చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఏవిధంగా పక్కకు తప్పించారో మాట్లాడితే అప్పుడు జవాబు చెప్పుకోలేక చంద్రబాబు, రేవూరితో సహా పార్టీలో అందరూ ఇబ్బందిపడాల్సి వస్తుందని గ్రహిస్తే మంచిది.          



Related Post