ఈసారి ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలో చేజిక్కించుకోవాలని తపన పడుతున్న కాంగ్రెస్ పార్టీ ముందుగా మహాకూటమిని ఏర్పాటు చేసుకొంది. మంగళవారం డిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈసారి ఎన్నికలలో మాజీ ఎంపీలను శాసనసభకు పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎంపీలు అన్నివిధాలా శక్తివంతులుగా ఉంటారు కనుక వారిని శాసనసభలో బరిలో దింపినట్లయితే, వారు తమ సీట్లను అవలీలగా గెలుచుకోవడమే కాకుండా సమీప నియోజకవర్గాలలో కూడా తమ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కనుక ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది మాజీ ఎంపీలను శాసనసభ ఎన్నికలలో పోటీ చేయించడం ద్వారా తమ పార్టీ విజయావకాశాలను మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
మాజీ ఎంపీలు విజయశాంతి (మెదక్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), సర్వే సత్యనారాయణ (మల్కజ్ గిరి లేదా కంటోన్మెంట్), మల్లు రవి (జడ్చర్ల), సురేశ్ షెట్కర్ (నారాయణ్ ఖేడ్), బలరాం నాయక్ (మహబూబాబాద్) నుంచి బరిలో దింపే అవకాశం ఉందని సమాచారం. ఎల్లుండి అంటే శుక్రవారం మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల అభ్యర్ధుల జాబితాను ప్రకటించబోతున్నారు కనుక ఆరోజున కాంగ్రెస్ ఎంపీల పోటీపై కూడా స్పష్టత రావచ్చు.