జీవన్ రెడ్డి కోరికను తీర్చండి: కేటిఆర్‌

January 01, 1970


img

ఈరోజు జగిత్యాల పట్టణంలో తెరాస ఎన్నికల ప్రచారసభ జరిగింది. మంత్రి కేటీఆర్ దానిలో మాట్లాడుతూ జగిత్యాల నుంచి పోటీ చేయబోతున్న కాంగ్రెస్‌ అభ్యర్ధి జీవన్ రెడ్డిని ఉద్దేశ్యించి చమత్కరించారు.

“గత 30 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్న జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు. ఆయన అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ జగిత్యాలకు చేసిందేమీ లేదు. కనీసం పట్టణంలో చిన్న వంతెన కూడా నిర్మించలేకపోయారు. కానీ ప్రజలు మళ్ళీ మళ్ళీ తననే గెలిపించాలని ఆయన కోరుతుంటారు. ఇవే నా చివరి ఎన్నికలని ఇకపై పోటీ చేయబోనని కూడా చెపుతుంటారు. కానీ ఎన్నికలొచ్చిన ప్రతీసారి పోటీ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట అంటున్నారు. కనుక మనం మాత్రం ఆయన మాటను ఎందుకు కాదనాలి? ఆయన మరో పదేళ్ళు రాజకీయాలలో ఉన్నా జగిత్యాల జిల్లాకు ఆయన వలన ప్రయోజనమేమీ ఉండదు కనుక ఆయన జీవితంలో ఇవే చిట్టచివరి ఎన్నికలుగా చేసి ఆయనకు రాజకీయాల నుంచి విశ్రాంతి కల్పించి ఇంటికి పంపించేద్దాము. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండాలంటే ఆయనకు నిజంగానే మళ్ళీ ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేయకూడదనిపించేలా ఉండాలి,” అని చమత్కరించారు.  

ఈ సభలో తెరాస ఎంపీ కవిత మాట్లాడుతూ, రాజకీయాలలో ఎంత సీనియారిటీ ఉందనేది ముఖ్యం కాదు ఎంత సిన్సియారిటీ ఉందనేదే ముఖ్యం. జీవన్ రెడ్డికి సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదు. అందుకే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా జగిత్యాలకు ఏమీ చేయలేదు. కనుక మనకు సీనియారిటీ ఉన్న నేతలు అవసరమా లేక సిన్సియారిటీ ఉన్న నేతలు అవసరమా? అని ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరూ ఒక్క మాట అడగకుండానే సిఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ నేతలకు, ప్రభుత్వాలకు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలైనా వచ్చాయా? నాలుగేళ్ళలో జగిత్యాలలో ఎన్ని మార్పులు వచ్చాయో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక మనకు మేలు చేస్తున్న తెరాసకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకొందాము,” అని అన్నారు.


Related Post