కర్ణాటక ఉపఎన్నికలలో కాంగ్రెస్-జెడిఎస్ కూటమి ఘన విజయం సాధించింది. మూడు లోక్ సభ, 2 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్-జెడిఎస్ కూటమి రెండు లోక్ సభ సీట్లు, రెండు శాసనసభ సీట్లు గెలుచుకొంది.
రామనగర శాసనసభ స్థానం నుంచి జేడీఎస్ తరఫున పోటీ చేసిన సిఎం కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి బిజెపి అభ్యర్ధిపై లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచారు.
జమాఖండి శాసనసభ సీటును కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆనంద్ భారీ మెజార్టీతో గెలుచుకొన్నారు.
ఇక బళ్ళారి అంటే గాలి జనార్ధన్ రెడ్డికి...బిజెపికి కంచుకోట వంటిది. కానీ బళ్ళారి లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్ధి ఉగ్రప్ప 2లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుచుకొన్నారు.
మాండ్యా లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన జెడిఎస్ అభ్యర్ధి శివరామ గౌడ కూడా భారీ మెజార్టీతో గెలిచారు.
శివమొగ్గ లోక్ సభ స్థానాన్ని మాత్రం బిజెపి దక్కించుకోగలిగింది. అందుకు కారణం ఎడ్యూరప్ప వదులుకొన్న ఆ నియోజకవర్గం నుంచి అయన కుమారుడు రాఘవేంద్ర పోటీ చేయడమేనని చెప్పవచ్చు.
త్వరలో 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సమయంలో బిజెపికి ఇంత ఘోరపరాజయం కలగడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. విజయోత్సహాంతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎన్నికలు జరుగబోతున్న 5 రాష్ట్రాలలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని, బిజెపికి ఓటమి తప్పదని వాదన మొదలుపెట్టారు.