ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎన్నికల వ్యూహాలు మరింత పదునెక్కుతున్నాయి. మహాకూటమికి చంద్రబాబుతో గట్టిగా ముడిపెట్టి దెబ్బతీయాలని తెరాస ప్రయత్నిస్తుంటే, తెరాసలో అంతర్గత విభేధాలను పెంచి దెబ్బ తీయాలని మహాకూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే మంత్రి హరీష్ రావును వారు టార్గెట్ చేసుకొన్నట్లు భావించవచ్చు.
సీనియర్ టిడిపి నేత రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ ఈ ఎన్నికలలో మహాకూటమికి, తెరాసకు సమానంగా సీట్లు వచ్చినట్లయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది. అప్పుడు మంత్రి హరీష్ రావు తన వర్గంతో తెరాస నుంచి బయటకు వస్తే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. హరీష్ రావు మొదటి నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. హరీష్ రావు లేనిదే కేసీఆర్ లేడు. కేసీఆర్ ప్రతీ విజయం వెనుక హరీష్ రావు ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఒక గొప్ప రాజకీయవేత్త. కష్టపడిపనిచేసే గుణం ఉన్నవాడు. అటువంటి మేధావిని పక్కనపెట్టి కేసీఆర్ తన కొడుకును సిఎం చేయాలనుకొంటున్నారు. అందుకు హరీష్ రావు చాలా ఆవేధన చెందుతున్నారు. కానీ అనివార్య పరిస్థితులలో మంత్రి హరీష్ రావు తెరాసలో కొనసాగుతూ, కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడక తప్పడంలేదు. ఎన్నికల తరువాత ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడినట్లయితే హరీష్ రావు తన అనుచరులతో కలిసి తెరాస నుంచి బయటకు వచ్చేస్తే ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు,” అని అన్నారు.
అంటే ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడి హరీష్ రావు తెరాస నుంచి బయటకు వస్తే మహాకూటమి ఆయనకు మద్దతు ఇస్తుందని రేవూరి చెపుతున్నట్లు భావించవచ్చు.
ఈసారి ఎన్నికలలో తెరాస 110 సీట్లు గెలుచుకొంటుందా లేక రేవూరి చెపుతున్నట్లు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? ఏర్పడితే హరీష్ రావు నిజంగానే తెరాస నుంచి బయటకు వస్తారా? వస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆయన కోసం త్యాగం చేయడానికి సిద్దపడుతుందా? అనే ఊహాజనితమైన ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు లభించవు కానీ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి.
1. హంగ్ ప్రస్తావన చేసి మహాకూటమి ఎన్నికలకు వెళ్ళకముందే తన ఓటమిని అంగీకరిస్తోంది.
2. రేవూరి చేసిన ఈ వ్యాఖ్యలు మంత్రి హరీష్ రావుకు చాలా తెరాసలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తాయనడంలో సందేహం లేదు.