కూటమి విచ్ఛిన్నానికి తెరాస కుట్ర చేస్తోంది: కోదండరామ్

November 06, 2018


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెరాసకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా అవతరిస్తున్న మహాకూటమిని విచ్చినం చేయడానికి తెరాస కుట్రలు చేస్తోంది. అయితే వాటిని మేము తిప్పి కొట్టి మహాకూటమిని కాపాడుకొంటాము. రాష్ట్రంలో తెరాస నియంతృత్వ పాలన అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలంటే ఎన్నికలలో మహాకూటమి గెలుపు అవసరం. కనుక ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ మహాకూటమికి అండగా నిలబడాలని నేను విజ్నప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

తెరాసపై ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన ఆరోపణలలో నిజానిజాలు పక్కన బెడితే, మరొక రెండు రోజులలో సీట్ల పంపకాలు జరుగకపోతే మహాకూటమి దానంతట అదే విచ్చినం అయిపోతుంది. కనుక మహాకూటమి విచ్చినం కోసం తెరాస కుట్రలు చేయవలసిన అవసరం లేదనే చెప్పవచ్చు.     

తెరాస మహాకూటమిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి, మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోతుందని తెరాస నేతలు గట్టిగా నొక్కి చెపుతున్నారు. తద్వారా మహాకూటమి పట్ల ప్రజలలో అపనమ్మకం, అనుమానాలు కల్పించి మహాకూటమిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తెరాస రాజకీయ వ్యూహంలో భాగమేనని చెప్పవచ్చు. కనుక మహాకూటమి విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్న తెరాస వాదనలను ఏవిధంగా ఎదుర్కోవాలి? తెరాసను ఎదుర్కొంటూ మరోపక్క ప్రజల నమ్మకం ఏవిదంగా పొందాలి? అని మహాకూటమి నేతలు ఆలోచిస్తే మంచిది.


Related Post