మహాకూటమిలో సీట్ల పంపకాలపై తేల్చకుండా సాగదీస్తున్న కాంగ్రెస్ పార్టీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ మూడు రోజులు గడువు ఇచ్చారు. మూడు రోజులలోగా తాము కోరుకొంటున్నట్లుగా హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, పినపాక, దేవరకొండ, వైరా స్థానాలను కేటాయించాలని లేకుంటే వాటితో సహా మరికొన్ని స్థానాలకు తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర, దేశరాజకీయాలలో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని సృష్టించాలనే తపనతోనే తాము సంయమనం పాటిస్తున్నామని, దానిని కాంగ్రెస్ పార్టీ అలుసుగా భావించరాదని అన్నారు. తెలంగాణలో కనీసం 40 స్థానాలలో గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తి సిపిఐకుందని కాంగ్రెస్ పార్టీ గ్రహించాలని చాడా వెంకటరమణ అన్నారు. కాంగ్రెస్ వైఖరి వలన మహాకూటమికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలస్యం చేస్తే, సిపిఐ ప్లాన్-బిని అమలుచేస్తుందని హెచ్చరించారు.
తాజా సమాచారం ప్రకారం, తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీలను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మరో 5 స్థానాలను త్యాగం చేసి 90 స్థానాలకే పరిమితం కావడానికి సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే టిజేఎస్, సిపిఐలు కోరుతున్న స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టు ఉన్నందున వాటిని వదులుకోవడానికి వెనుకంజవేస్తోంది. టిడిపికి శేరిలింగంపల్లి స్థానాన్ని కేటాయించబోతోందని మీడియాలో వార్తలు రాగానే అక్కడి నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొన్న భిక్షపతి యాదవ్, ఆయన అనుచరులు ఆదివారం గాంధీ భవన్ వద్దనే నిరసనలు తెలియజేసి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు షాక్ ఇచ్చారు.
ఒకవేళ టిజేఎస్, సిపిఐ పార్టీలు కోరుకొంటున్న స్థానాలను వాటికి కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ఇంతకంటే పెద్ద కల్లోల్లమే మొదలవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది కనుకనే మిత్రపక్షాలకు సీట్లు కేటాయించలేకపోతోందని చెప్పవచ్చు. అయితే నామినేషన్లు వేసే సమయం కూడా దగ్గర పడుతున్నందున కాంగ్రెస్ పార్టీ ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు.