గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేయబోతున్నట్లు భావిస్తున్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, బిజెపి నేత, శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందపై తెరాస నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
“గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న సిఎం కేసీఆర్‌ను ఓడించాలని, అందుకు ధనసహాయం కూడా చేస్తానని మంత్రి హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని” వంటేరు ప్రతాప్ రెడ్డి వివాదాస్పద ప్రకటన చేశారు. దానికి సంబందించిన వీడియో ఫుటేజీని వారు రజత్ కుమార్ కు అందజేశారు. అలాగే స్వామి పరిపూర్ణానంద తమ పార్టీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఫిర్యాదు చేశారు. అటువంటి నిరాధారమైన ఆరోపణలతో తమ పార్టీకి తీవ్రనష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నందుకు వారిరువురిపై చర్యలు తీసుకోవాలని తెరాస నేతలు కోరారు.
మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వంటేరు అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా తప్పే. కానీ తెరాస నేతలు కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి ఏమైనా గౌరవంగా మాట్లాడుతున్నారా?అని ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. అద్దాల మేడలో కూర్చొని ఇతరులపై రాళ్ళు విసిరితే ఏమవుతుందో తెరాసకు అదే జరిగిందని చెప్పవచ్చు. వారు రాజకీయాలలో హుందాతనం పాటించి ఉంటే ప్రతిపక్ష పార్టీలు కూడా హుందాగా వ్యవహరించేవి. కానీ మనం ప్రత్యర్ధులను నోటికి వచ్చినట్లు నిందిస్తాము కానీ మనల్ని ఎవరూ వేలెత్తి చూపకూడదంటే సాధ్యం కాదు. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రత్యర్ధులపై బురద జల్లితే అవి కూడా అదే పని చేయకుండా ఊరుకొంటాయా? కనుక రాజకీయాలలో హుందాతనం పాటించడం అందరికీ అవసరమే.