సీట్ల పంపకాలే ఇంత కష్టమైతే మరి....

November 05, 2018


img

మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఇంచుమించు రెండు నెలలుగా భాగస్వామ పార్టీల నేతలు చర్చిస్తున్నారు కానీ ఇంతవరకు సీట్ల పంపకాలు పూర్తవలేదు. ఈరోజు సాయంత్రానికి దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామని టిజేఎస్ నేత దిలీప్ కుమార్ చెప్పారు. గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిలో సీట్ల పంపకాలే చేసుకోలేకపోతున్న మహాకూటమి ఒకవేళ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? 

ముఖ్యమంత్రి, మంత్రి పదవుల కోసం మహాకూటమిలో కీచులాటలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించవచ్చు. ముందుగా కాంగ్రెస్ పార్టీలోనే వీటికోసం తీవ్రమైన పోటీ ఉంటుందని అందరికీ తెలుసు. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ గనుక సహజంగానే కీలక మంత్రి పదవులను అదే తీసుకోవాలని ప్రయత్నించవచ్చు. సీట్ల విషయంలోనే వెనక్కు తగ్గడానికి ఇష్టపడని టిడిపి, టిజేఎస్, సిపిఐ పార్టీలు అప్పుడు ఏవిధంగా స్పందిస్తాయి? అనే సందేహం కలుగకమానదు. 

ఈ దశ తరువాత పరిపాలన, విధానపరమైన (సమర్ధమైన) నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మహాకూటమిలో నాలుగు పార్టీలకు నాలుగు రకాల మేనిఫెస్టోలున్నాయి. వాటిలో ప్రతీ అంశాన్ని, హామీని అమలుచేస్తామని ఎన్నికల ప్రచారంలో అవి ప్రజలకు చెప్పుకొంటున్నాయి. కనుక అవి తమ మేనిఫెస్టోలను అమలుచేస్తాయా?లేక మహాకూటమి ఏర్పాటు చేసుకొన్న ‘కామన్ మినిమమ్ అజెండా’ ప్రకారం పాలన సాగిస్తాయా? కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంటుందా? అంటే అనుమానమే. 

ఇక తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘లక్ష ప్రభుత్వోద్యోగాలు’ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. కానీ తెరాస సర్కార్ నాలుగేళ్లలో కలిపి లక్ష ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఇది ఆచరణ సాధ్యం కాని హామీ అని భావించవచ్చు. ఒకవేళ ఈ హామీని అమలుచేయలేకపోతే, టిడిపి, సిపిఐలు సర్ధుకుపోవచ్చునేమో కానీ టిజేఎస్ సర్దుకుపోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. పైగా ఉద్యోగాల భర్తీకి నిర్ధిష్టమైన కేలండర్ ప్రకటించాలనేది దాని చిరకాల డిమాండ్. దాని ప్రకారం ఏటా ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయాలని టిజేఎస్ డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుంది?అనే సందేహం కలుగకమానదు. 

మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సుమారు 10 లక్షల మందికి నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తామని, ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. టిజేఎస్, టిడిపిల మేనిఫెస్టోలలో కూడా ఇటువంటివే అనేక హామీలుంటాయని వేరే చెప్పనక్కరలేదు. కనుక వాటన్నిటి అమలు చేయాలంటే భారీగా నిధులు కావాలి. రాష్ట్ర ఆదాయానికి ఖర్చులకు పొంతన లేనివిధంగా నాలుగు పార్టీలు ఇస్తున్న ఈ హామీలన్నిటినీ అవి నిజంగా అమలుచేయగలవా? అనే అనుమానం కూడా ఉంది. 

ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ కార్యక్రమాల అమలు అన్ని సజావుగా సాగాలంటే నిధులొక్కటే సరిపోవు. ప్రభుత్వాన్ని నడిపించబోయే పార్టీల మద్య, వాటి నేతల మద్య పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం కలిగి ఉండాలి. గెలుస్తామో లేదో తెలియని సీట్లనే త్వరగా, సజావుగా సర్దుబాటు చేసుకోలేకపోతున్న మహాకూటమిలో పార్టీలు ఒకవేళ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అనే సందేహం కలుగకమానదు. సంకీర్ణ ప్రభుత్వాలలో ఇటువంటి సమస్యలు సర్వసాధారణమే కానీ రాష్ట్ర ప్రజలు ఇటువంటి సమస్యలు భరించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నకు మహాకూటమి నేతలే జవాబు చెప్పాల్సి ఉంటుంది.


Related Post