మహాకూటమికి సిపిఐ వార్నింగ్!

November 05, 2018


img

మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుతున్నాయే తప్ప ఫలితం కనిపించడం లేదు. పైగా సిపిఐకి 2-3 సీట్లు కేటాయిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా లీకులు ఇస్తుండటంతో సిపిఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశంపై ఆదివారం చర్చించిన సిపిఐ నేతలు తమకు కనీసం 5 సీట్లు...అవి కూడా తాము కోరుకొంటున్నట్లు నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనే ఇవాలని లేకుంటే మహాకూటమికి గుడ్ బై చెప్పేస్తామని హెచ్చరించారు.

ఒకవేళ మహాకూటమిలోతాము కోరుకొన్న స్థానాలు ఇవ్వనట్లయితే తాము ముందు అనుకొన్న ప్లాన్-బి ప్రకారం రాష్ట్రంలో 21 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మహాకూటమి నేతలు సోమవారం మళ్ళీ మరోసారి సమావేశం కానున్నారు. ఈరోజు సమావేశంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏఏ స్థానాల నుంచి ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై స్పష్టత రావచ్చు. 

ఈనెల 8 లేదా 9 తేదీలలోగా కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించడానికి సిద్దంగా ఉంది కనుక మహాకూటమిలో ఎన్ని చర్చలు జరిపినా అదే గడువుగా భావించవచ్చు. తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీలు నేటికీ మహాకూటమిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఉన్నందునే అవి చాలా సీట్ల కేటాయింపుపై ఆలస్యం జరుగుతున్నా సంయమనం పాటిస్తున్నాయి. కానీ ఈ నెల 12 నుంచి నామినేషన్లు మొదలవుతాయి కనుక సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్ పార్టీ ఇంకా సాగదీస్తే ఆ రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కనుక అవి మహాకూటమికి గుడ్ బై చెప్పడానికి వెనుకాడకపోవచ్చు.


Related Post