మంత్రి హరీష్ మాతో టచ్చులో ఉన్నారు: కాంగ్రెస్‌ నేత

November 03, 2018


img

ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెరాసలో హరీష్ రావు గురించి ఒక మాట తప్పకుండా వినిపిస్తుంటుంది. అదే...ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని! ఈరోజు మళ్ళీ అదే మాట వినిపించింది. ఈసారి ఆ మాట అన్నది గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీకి సిద్దం అవుతున్న కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి. 

శనివారం ఆయన గజ్వేల్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాసలో అంతర్గత కలహాలు ముదిరి పాకాన్న పడ్డాయి. సిఎం కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి హరీష్ రావు నిన్న నాకు ఓ ప్రైవేట్ నెంబరు నుంచి ఫోన్ చేసి ఈసారి ఎన్నికలలో కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని, అవసరమైతే ఆర్ధికసహాయం అందిస్తానని చెప్పారు. సిఎం కేసీఆర్‌ తన కొడుకు కేటిఆర్‌ కోసం నా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కేసీఆర్‌ వైఖరితో వేగలేకపోతున్నానని మంత్రి హరీష్ రావు నాతో అన్నారు. కనుక ఈసారి ఎన్నికలలో కేసీఆర్‌ ను ఓడించాలని అందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తానని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికే సిద్దపడే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నానని నేను ఆయనకు చెప్పాను. అందుకు ఆయన సహాయసహకారాలు అవసరం లేదని సున్నితంగా తిరస్కరించాను. మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీతో కూడా టచ్చులో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉంది,” అని ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు. 

కేటిఆర్‌కు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించడానికి సిఎం కేసీఆర్‌ హరీష్ రావును పక్కనపెడుతున్నారనే వాదన ప్రతిపక్షపార్టీల నుంచే వస్తుంటుంది తప్ప గత నాలుగున్నరేళ్ళలో ఏనాడూ మంత్రి హరీష్ రావు నోట అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక్క మాట వినిపించలేదు. 

ఇటీవల కేటిఆర్‌, హరీష్ రావు కలిసినప్పుడు కేటిఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “మేము బావాబావామరుదులైనప్పటికీ చిన్నప్పటి నుంచి అన్నదమ్ములాగే పెరిగాము. హరీష్ రావు వంటి మంచి అనుభవజ్నుడితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మద్య విభేధాలున్నాయని మీడియాలో వార్తలు చూసినప్పుడు ఇద్దరం నవ్వుకొంటాము. మేము పనిలోనే పోటీ పడతాము తప్ప జీవితంలో కాదు,” అని అన్నారు. మంత్రి హరీష్ రావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కనుక కాంగ్రెస్‌ నేతలు హరీష్ రావుపై సానుభూతి చూపిస్తూ, ఆయన మాతో టచ్చులో ఉన్నారని చెప్పడం ‘మైండ్ గేమ్’ గానే భావించవచ్చు. ఒకవేళ మంత్రి హరీష్ రావు నిజంగానే తెరాసలో ఇమడలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటారేమో కానీ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవచ్చు.


Related Post