తెరాస వ్యూహానికి సానుభూతితో చెక్!

November 03, 2018


img

రాష్ట్ర శాసనసభ రద్దుతో ఎన్నికల యుద్దాన్ని ప్రారంభించిన తెరాస అన్ని పార్టీలకంటే వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఆరంభంలోనే మహాకూటమిపై విమర్శలతో ఈ యుద్దాన్ని ఉదృతస్థాయిలో ప్రారంభించిన తెరాస సేనాని కేసీఆర్‌, ఆ తరువాత ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలతో యుద్దాన్ని పతాకస్థాయికి చేర్చారు. మహాకూటమిని చంద్రబాబు నాయుడుతో బలంగా ముడిపెట్టడం ద్వారా దాని పట్ల తెలంగాణ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కల్పించి తద్వారా తనకు సవాలు విసురుతున్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలనేది కేసీఆర్‌ వ్యూహం కావచ్చు. 

ఆ వ్యూహంలో భాగంగా తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు ఏవిధంగా అడ్డుకొనే ప్రయత్నాలు చేశారో తెరాస నేతలు ప్రజలకు వివరించి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే దాని వెనుక ఉన్న చంద్రబాబు ప్రాజెక్టులను నిలిపివేయిస్తారని, మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడక మునుపు దయనీయ పరిస్థితులు పునరావృతం అవుతాయని తెరాస నేతలు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కష్టపడి పొరాడి సాధించుకొన్న తెలంగాణను మహాకూటమి నేతలు డిల్లీకి, అమరావతికి అప్పగించి మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకొందామా? అని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రజలలో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. తెరాస వాదనలకు ప్రజలు కూడా బాగానే కనెక్ట్ అవుతున్నారు. కనుక దాని వ్యూహం ఫలిస్తే తెరాస చేతిలో మహాకూటమికి ఘోరపరాజయం తప్పదు. 

అయితే ఈ వ్యూహంతో తెరాసకు కొంత నష్టం కూడా తప్పదు. ఈ వ్యూహంలో భాగంగా తెరాస నేతలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై చేస్తున్న అనుచిత విమర్శలు తెలంగాణలో...ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ హైదరాబాద్‌ తదితర ప్రాంతాలలో స్థిరపడిన ఆంధ్రాప్రజల మనసులను తీవ్రంగా గాయపరుస్తోంది. ఎంతకాదనుకొన్నా చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే అందుకు కారణమని చెప్పవచ్చు. కనుక ఈ కారణంగా తెరాస పట్ల వారిలో వ్యతిరేకత పెరిగితే అది మహాకూటమికి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. 

చంద్రబాబు కూడా తెరాస నేతలకు ధీటుగా జవాబు ఇవ్వగలరు లేదా తన పార్టీ నేతల చేత జవాబు ఇప్పించగలరు కానీ ఆయన ఈ విషయంలో చాలా సంయమనం పాటిస్తూ ఆచితూచి విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే తాము సిఎం కేసీఆర్‌, తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే, తెలంగాణ ప్రజలలో టిటిడిపి పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది దాని వలన టిడిపి, మహాకూటమి రెండూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పైగా తెరాస విమర్శలకు ఎంత ఎక్కువ స్పందిస్తే అంత తెరాసకు అనుకూలంగా మారుతుంది. అందుకే తెరాస నేతలు ఎంత రెచ్చగొడుతున్నా వారి విమర్శలకు బదులివ్వకుండా, తాను హైదరాబాద్‌ అభివృద్ధి కోసం చేసిన కృషి గురించి గట్టిగా నొక్కి చెపుతున్నారు. తద్వారా టిడిపి-వైకాపాల మద్య చీలిపోయున్న తెలంగాణలోని ఆంధ్రా ప్రజల సానుభూతిని వీలైతే తెలంగాణ ప్రజలందరి సానుభూతిని సంపాదించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 

కనుక చంద్రబాబు నాయుడుని, టిడిపిని, మహాకూటమిని కలిపి విమర్శించడం ద్వారా ప్రజలలో తెలంగాణ సెంటిమెంటు రగిలించి ఎన్నికలలో పైచేయి సాధించాలని తెరాస ప్రయత్నిస్తుంటే, అదే కారణంగా ఏర్పడిన సానుభూతితో టిటిడిపికి, మహాకూటమికి లబ్ది కలిగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తుండటం విశేషం. 


Related Post