ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి హడావుడి

November 03, 2018


img

కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ అర్ధాంగి లక్ష్మీ పార్వతి శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తన భర్త స్వర్గీయ ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టిడిపిని స్థాపించారో చంద్రబాబు నాయుడు దానితోనే పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడటం చూస్తే ఆయన ఎంత దిగజారిపోయారో అర్ధం అవుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. తన భర్త పేరు, ఫోటో టిడిపి ఎక్కడా వాడుకోకుండా కోర్టులో కేసు వేయడానికి ఎన్టీఆర్ భార్యగా తనకు హక్కు, అవకాశాలున్నాయో లేదో  న్యాయనిపుణులను సంప్రదించి తెలుసుకొన్నాక అవకాశం ఉంటే తప్పకుండా టిడిపిపై కేసు వేస్తానని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. 

లక్ష్మీ పార్వతికి ఏ పార్టీలో చేరకపోయుంటే ఆమె మాటలకు విలువ ఉండేది కానీ ఆమె ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తులు పెట్టుకోవడానికి వీలులేదని చెప్పడానికి ఆమెకు ఎటువంటి హక్కు లేదు. ఆమె తన పార్టీ వ్యూహంలో భాగంగానే ఈ నిరసన దీక్ష చేస్తున్నారని భావించక తప్పదు.

బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకొన్న తరువాత చంద్రబాబుకు హటాత్తుగా రాజకీయ శత్రువులు పెరిగిపోయారు. ఆ కారణంగా టిడిపి ప్రస్తుతం కాస్త బలహీనంగా కనిపిస్తోంది కూడా. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపిని చాలా సులువుగా ఓడించి ఆధికారంలోకి రావచ్చునని జగన్మోహన్ రెడ్డి కలలు కంటుంటే ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు తమ బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అందరికీ షాక్ ఇచ్చారు. 

కనుక దీనిని జీర్ణించుకోలేని వైకాపా కాంగ్రెస్‌-టిడిపిల పొత్తుల మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఏపీలో టిడిపిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకే చెందిన లక్ష్మీ పార్వతి ధర్నాను కూడా అదే కోణంలో చూసినట్లయితే, వైకాపా వ్యూహంలో భాగంగానే ఆమె ఈవిధంగా చేస్తున్నారని అర్ధం అవుతుంది. అయితే కాంగ్రెస్‌-టిడిపి పొత్తులను ఏపీ ప్రజలు అంగీకరిస్తారా లేదా? అనే విషయం ఎన్నికలు జరిగితేగానీ తెలియదు.


Related Post