మహాకూటమిపై తెరాస విమర్శలు దేనికి?

November 03, 2018


img

ఒకప్పుడు అన్ని పార్టీలు వాటి సిద్దాంతాల ఆధారంగా పనిచేసేవి. భావస్వారూప్యత కలిగిన పార్టీలు మాత్రమే పొత్తులు పెట్టుకొనేవి. అందుకు చక్కటి ఉదాహరణగా వామపక్షాలను చెప్పవచ్చు. కానీ కాలక్రమేణా ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పొత్తులు, కూటముల ఏర్పడటం మొదలయ్యాయి. వాటికి యూపీయే, ఎన్డీయే కూటములను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలన్నీ అధికారం చేజిక్కించుకోవడం కోసం తమ పార్టీల ఆశయాలను, సిద్దాంతాలను పక్కన పెట్టాయో అప్పుడే అవి ‘శీలం’ కోల్పోయాయి. 

ఇక్కడ తెరాస, అక్కడ ఏపీలో టిడిపి రెండూ కూడా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచి దెబ్బ తీసేందుకు రాష్ట్రాభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఆ విదంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకపోవడంవంటివి రాజకీయాలలో నైతిక విలువలు ఎంతగా దిగజారో అద్దం పడుతున్నాయి. కనుక నేటి రాజకీయ పార్టీలలో...వాటి పొత్తులలో...కూటములలో పవిత్రమైనవి, అపవిత్రమైనవి అంటూ ఏమీ లేవు. అన్ని ఒక తానులో ముక్కలే. మహాకూటమి కూడా అందుకు మినహాయింపు కాదనే చెప్పవచ్చు. మహాకూటమి ఏర్పాటుకు వారు ఏవో గొప్ప ఆశయాలు చెపుతున్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికి టిడిపి, సిపిఐ పార్టీలు, తొలి ప్రయత్నంలో శాసనసభలో అడుగుపెట్టడానికి టిజేఎస్ మహాకూటమిలో భాగస్వాములుగా చేరాయని చెప్పవచ్చు. 

ఈ సంగతి తెరాసకు తెలియదనుకోలేము కానీ అది కాంగ్రెస్-టిడిపిల పొత్తులపై, మహాకూటమిపై నిప్పులు చెరుగుతోంది. అందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీలో కొమ్ములు తిరిగిన నాయకులున్నారు. వారిలో కనీసం 25-30 మంది తప్పకుండా గెలిచే అవకాశాలున్నాయి. టిడిపి నాయకుల స్వంత బలంతో పాటు ఎంతో కొంత ఆంధ్రా ఓటర్ల మద్దతు ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కనీసం 25 స్థానాలలో ఆంధ్రా ఓటర్లు ప్రభావితం చేయగలరు. అయితే వారి ఓట్లన్నీ టిడిపికే ఖచ్చితంగా పడతాయనే గ్యారెంటీ లేదు. (కానీ సిఎం కేసీఆర్‌, తెరాస మంత్రులు మహాకూటమిని నిలువరించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడుపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, ఆంధ్రా ఓటర్లలో తెరాస పట్ల వ్యతిరేఖత కల్పించి అది మహాకూటమికి అనుకూలంగా మారవచ్చు.) ఇక టిజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ కు రాష్ట్రంలో ఉన్న పలుకుబడి, ప్రజాధారణ కారణంగా కనీసం రెండు మూడు సీట్లు తప్పకుండా గెలుచుకొనే అవకాశం ఉంది. సిపిఐ కూడా తన స్థానాలను తాను గెలుచుకొనే అవకాశాలున్నాయి. అంటే సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెరాస నిజంగానే ప్రభంజనం సృష్టిస్తే తప్ప మహాకూటమి కనీసం 40 సీట్లు వరకు గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తెరాసకు చాలా ఆందోళన కలిగించే విషయమే. బహుశః అందుకే తెరాస నేతలు మహాకూటమిపై అంతగా విరుచుకుపడుతున్నారని చెప్పవచ్చు. అయితే తెరాస నేతలు మహాకూటమిని చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని  విమర్శలు గుప్పించడం కంటే తమ ప్రభుత్వం గత నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధి పనుల గురించి, అమలుచేసిన సంక్షేమ పధకాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొంటేనే రాష్ట్రంలో తెరాస ప్రభంజనం ఏర్పడుతుందని చెప్పవచ్చు. 


Related Post