కోదండరామ్ అసలు విషయం చెప్పనేలేదు!

November 02, 2018


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తన పార్టీ ముఖ్యనేతలతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డిల్లీలో సమావేశమయ్యారు. వారు టిజేఎస్ కు సీట్ల కేటాయింపుపై ప్రధానంగా చర్చించారని తెలుసు. 

సమావేశం అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మేము రాహుల్ గాంధీతో 40 నిమిషాలు సమావేశమయ్యాము. రాష్ట్రంలో బడుగుబలహీనవర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించి, సమాజంలో మార్పు తీసుకురావడం కోసమే మహాకూటమి ఏర్పాటు చేశామని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా సాగుతున్న తెరాస నిరంకుశ పాలనకు ముగింపు పలికి ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణమైన పాలన తీసుకురావలనే ఉద్దేశ్యంతోనే మహాకూటమిలో మేము చేరాము. కనుక ఆ లక్ష్యం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించాము. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా మాకు 17 సీట్లు కేటాయించాలని కోరాము. సాధ్యమైనంత త్వరగా మహాకూటమి ఏర్పాటు చేసి ముందుకు సాగాలని చెప్పాము,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ 95, టిడిపి14 సీట్లు పంచేసుకొన్నామని గురువారం సాయంత్రమే ప్రకటించిన తరువాత కోదండరామ్ తమకు 17 సీట్లు కేటాయించాలని రాహుల్ గాంధీని అడిగామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తాము ఎన్ని సీట్లు కావాలని అడిగామో ఆయన చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇస్తానని చెప్పిందో ఆయన చెప్పలేదు. చెపితే మహాకూటమి నుంచి సిపిఐ తక్షణమే బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కనుక హైదరాబాద్‌ చేరుకొన్నాక మళ్ళీ సిపిఐ నేతలతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేసి అవి ఫలిస్తే అప్పుడు నాలుగు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేయవచ్చు.


Related Post