కాంగ్రెస్‌ మీద సిపిఐ గుస్సా...క్యో?

November 02, 2018


img

కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపుపై మీడియాకు లీకులు ఇవ్వడంపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నిర్ధిష్టమైన రాజకీయ లక్ష్యంతో ఏర్పడిన మహాకూటమిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకాలపై ఎన్ని మీడియా లీకులు ఇస్తున్నా సంయమనం పాటిస్తున్నాము. అందరం కలిసి పనిచేయాలనుకొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో వ్యవహరించవలసిన తీరు ఇది కాదు.

మహాకూటమిలో మాకు గౌరవప్రదమైన స్థానం, సీట్లు లభిస్తాయని భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాకు రెండు, మూడు సీట్లు ఇస్తామన్నట్లు మీడియాకు లీకులు ఇస్తోంది. సుమారు రెండు నెలలుగా చర్చలు జరుగుతున్నా ఇంతవరకు ఏ పార్టీకెన్ని సీట్లు, ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే దానిపై స్పష్టత రాలేదు. ఆలస్యం జరుగుతున్నా కొద్దీ మహాకూటమి నష్టపోతుంది. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని మేము కోరుతున్నాము.

ఎల్లుండి (ఆదివారం) సీపీఐ రాష్ట్ర పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొన్నాము. ఈలోగా కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే ఆ సమావేశంలో మా భవిష్య కార్యాచరణపై చర్చించి మా నిర్ణయం ప్రకటిస్తాము,” అని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా గురువారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ-95, టిడిపి-14, మిగిలిన 10 స్థానాలను టిజేఎస్, సిపిఐ పార్టీలకు కేటాయించాము,” అని చెప్పారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ శుక్రవారం టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో డిల్లీలో చర్చించారు. ఆ సమావేశంలో టిజేఎస్ కు ఎన్ని సీట్లు కేటాయించారో ఇంకా తెలియవలసి ఉంది. టిజేఎస్ కు ఇవ్వగా మిగిలిన సీట్లని సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయం తెలుసుకోకుండా తమకు 2-3 సీట్లు కేటాయిస్తామన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడటం సిపిఐకి ఆగ్రహం కలిగించడం సహజమే. కనుక సిపిఐ మహాకూటమిలో ఉంటుందా లేదా అనే సంగతి 4వ తేదీన సమావేశం తరువాత తెలుస్తుంది.    



Related Post