ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే దోస్తీ! నిజమేనా?

November 02, 2018


img

డిల్లీ వేదికగా గురువారం ఒకసరి కొత్త రాజకీయసమీకరణకు బీజం పడింది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సిఎంలు ములాయం సింగ్, అఖిలేశ్ సింగ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితర నేతలను కలిసి దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ కలిసికట్టుగా పొరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొందామని ప్రతిపాదించగా అందరూ దానికి అంగీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, ఐ‌టి దాడులు చేయిస్తూ భయపెట్టి యావత్ దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 

వారి వాదనలో కొంత నిజమున్న మాట వాస్తవం. అయితే వారు నిజంగానే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే చేతులు కలపడానికి సిద్దపడుతున్నారా? లేక తమ అధికారం కాపాడుకోవడం కోసం, కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం కోసం, తమపై జరుగుతున్నా ఐ‌టి దాడుల నుంచి తమను తాము కాపాడుకొనేందుకు ఈవిధంగా రాజకీయ రక్షణ కవచం ఏర్పాటు చేసుకొంటున్నారా? అని ఆలోచించక తప్పదు. 

ముందుగా దీని కోసం చొరవ తీసుకొన్న చంద్రబాబు పరిస్థితిని ఒకసారి గమనిస్తే, ఏప్రిల్ లో జరుగబోయే ఎన్నికలలో వైకాపా నుంచి తీవ్రపోటీ ఉంటుంది. మరోపక్క జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కవాతులు, బహిరంగసభలు నిర్వహిస్తూ టిడిపి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల సందర్భంగా సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి గల్లీ స్థాయి నేతలు కూడా చంద్రబాబును పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకొన్నందున చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం పక్కలో బల్లెంలా మారింది. రాష్ట్రంలో ఐ‌టి దాడులు జరిపిస్తూ టిడిపి నేతలలో భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నాలుగేళ్లలో టిడిపి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయింది. పైగా జగన్ పుణ్యామని అవినీతిముద్ర కూడా పడింది. కనుక ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉండటం సహజం. ఇటువంటి పరిస్థితులలో టిడిపి ఎన్నికలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడటానికి గట్టి ప్రయత్నం చేయాలి లేకుంటే రానున్న రోజులలో పరిస్థితుళు మరింత దారుణంగా మారిపోవచ్చు. తనకు, తన పార్టీకి, తన ప్రభుత్వానికి సమస్యలు వస్తే అవి ప్రజాస్వామ్యానికి వచ్చిన సమస్యలేనని బాబు చెపుతున్నారు. 

చంద్రబాబు నాయుడు నిన్న కలిసిన నేతలలో రాహుల్ గాంధీతో సహా దాదాపు అందరూ అధికారానికి దూరమయ్యి దానికోసం చకోరపక్షులా ఎదురుచూస్తున్నారు కనుక బాబుతో గొంతు కలిపి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. కాపాడుకోవాలంటూ కోరస్ పాడారు. బిజెపి పాలనలో కొంత మతతత్వ, నిరంకుశపోకడలు కనిపిస్తుంటాయి. అలాగే నోట్లరద్దు, జిఎస్టి వంటి నిర్ణయాలు ప్రజలలో వ్యతిరేకతను ఏర్పరిచాయి. మోడీ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఆటుపోటులకు లోనవుతోంది. అవినీతిని వెలికి తీసే సిబిఐలోనే అవినీతి బయటపడింది. కనుక ఈ వ్యతిరేక వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ సమస్యల నుంచి బయటపడుతూనే అధికారం చేజిక్కించుకోవడం కోసం ఒక్కటవుతున్నాయని చెప్పవచ్చు. 


Related Post