టికెట్ కావాలంటే డబ్బు ఉండాలి: బిజెపి నేత

November 02, 2018


img

ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలకు కూడా ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్లు, వారి శక్తి సామర్ధ్యాలను బట్టి పదవులు లభిస్తుండేవి కానీ ఇప్పుడు ఏ పార్టీలోను ఆ పరిస్థితి లేదు. టికెట్లు కావాలంటే బాగా డబ్బు, పలుకుబడి, సమాజంలో గుర్తింపు ఉండాలి. అవసరమైతే ఎన్నికలలో పార్టీకి అవసరమైన పెట్టుబడి పెట్టగలగాలి. కనుక కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ధనికులు మాత్రమే టికెట్లు, మంత్రి పదవులు సంపాదించుకోగలుగుతున్నారు. అటువంటి వ్యాపారవేత్తలు, ధనికులు పదవులు అధికారం సంపాదించుకొంటే వాటితో వారు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, వాటిలో లొసుగులను కప్పి పుచ్చుకోవడానికే ఆలోచిస్తారు తప్ప      ప్రజల కష్టాలను, సమస్యల గురించి ఆలోచించరని వేరే చెప్పనవసరం లేదు. బిజెపి కూడా దీనికి అతీతం కాదని ఆ పార్టీ సంగారెడ్డి అధ్యక్షుడు బుచ్చిరెడ్డి చెప్పారు. 

తాను అనేక ఏళ్లుగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని కానీ తనకు డబ్బు లేని కారణంగా పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి సరైన గుర్తింపు లేదని అన్నారు. పార్టీ కోసం పడే ఈ కష్టమేదో వ్యవసాయంలో పెడితే నేను నా కుటుంబం హాయిగా జీవించగలుగుతామని బుచ్చిరెడ్డి అన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. బుచ్చిరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా బిజెపికి గుడ్ బై చెప్పేశారు. తమకు వేరే పార్టీలో చేరే ఆలోచన లేదని అందరం ఆలోచించుకొని భవిష్య కార్యాచరణ నిర్ణయించుకొంటామని తెలిపారు. 


Related Post