వాళ్ళ కుటుంబాలే పంచేసుకొంటాయా? గుత్తా

November 01, 2018


img

ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురూ నల్గొండ జిల్లాలోని అన్ని పదవులూ పంచేసుకొంటున్నారని విమర్శించారు. ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తన భార్యకు, జానారెడ్డి తనకు తన కుమారుడికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అన్ని పంచేసుకొని పార్టీలో మరెవరికీ దక్కకుండా అన్యాయం చేస్తున్నారు. వారు ముగ్గురూ తమ వారసులను జిల్లా ప్రజలపై బలవంతంగా రుద్ది జిల్లాను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తామని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ కాంగ్రెస్‌ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు. కనుక జిల్లా ప్రజలు వారు ముగ్గురినీ, వారి వారసులను ఓడించి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి,” అని అన్నారు.

సిఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల గుప్పిట్లో రాష్ట్రం బందీ అయిపోయిందని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలకు, గుత్తా ఈవిధంగా సమాధానం చెప్పారనుకోవాలి. కానీ కేసీఆర్‌ వారసులు అధికారం పంచుకోవడం తప్పుకానప్పుడు, కాంగ్రెస్‌ నేతలు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకొంటే తప్పెలా అవుతుంది? అయినా మనదేశంలో వారసత్వ రాజకీయాలు కొత్తేమీ కాదు. అందరూ అదే బాటలో నడుస్తూ ఒకరినొకరు విమర్శించుకోవడమే విడ్డూరంగా ఉంటుంది. ఇక కాంగ్రెస్‌ హామీలను ఎద్దేవా చేసిన తెరాస ఆ తరువాత వాటినే యధాతధంగా ప్రకటించింది. కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యం కానప్పుడు అవే హామీలను తెరాస మాత్రం ఏవిధంగా అమలుచేయగలదు?ఆచరణ సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకు హామీ ఇస్తోంది?అంటే అర్ధం ఏమిటి?


Related Post