తన వ్యూహం నుంచి తెరాస పక్కదారి పట్టిందా?

November 01, 2018


img

సిఎం కేసీఆర్‌ సుమారు తొమ్మిది నెలలు ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనేక కారణలున్నాయి. గత నాలుగేళ్లలో తెరాస హయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఎన్నికలలో ప్రధానంగా చర్చ జరిగేలా చేయవచ్చనే కారణం వాటిలో ఒకటి. ఆ చర్చతో తెరాసకు సవాలు విసురుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి కల్పించాలనేది తెరాస వ్యూహం. 

కానీ తెరాస ప్రచారధోరణి చూస్తుంటే ఆ వ్యూహం నుంచి పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. ఆ వ్యూహం ప్రకారం అది ముందుకు సాగితే, గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ఏమేమి చేసింది?మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుంది? అనే విషయాలను ప్రజలకు వివరించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ తెరాస నేతలు ఎంతసేపు ‘మహాకూటమి-చంద్రబాబు నాయుడు-డిల్లీ-ఆత్మగౌరవం’ అంటూ విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి తెరాస ప్రభుత్వం చేసిన కృషి పట్ల అధికశాతం ప్రజలు కేసీఆర్‌ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారని అనేక సర్వేలలో ఈ సంగతి స్పష్టం అయ్యిందని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. అలాగే 100-110 సీట్లు వస్తాయని  సిఎం కేసీఆరే స్వయంగా చెప్పారు. తమకే విజయావకాశాలున్నాయని ఇంత బలంగా వారు నమ్ముతున్నప్పుడు మహాకూటమి గురించి అంతగా మాట్లాడటం ఎందుకు? దానిని చూసి అంతగా ఆందోళన చెందడం దేనికి? అని ఆలోచిస్తే  తెరాసలో నేటికీ ఎంతో కొంత అభద్రతాభావం, ఓటమి భయం ఉన్నట్లే కనిపిస్తోంది.           

తెరాస ఏ ఉద్దేశ్యంతో ఈ వాదనలు చేస్తున్నప్పటికీ అవి ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని చెప్పకతప్పదు. ఒకవేళ ప్రజలు తెరాస వాదనలతో ఏకీభవిస్తే ఈసారి ఎన్నికలలో మహాకూటమికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి.... ఘోరపరాజయం తప్పదు. ఈ సంగతి మహాకూటమి నేతలు కూడా గ్రహించే ఉంటారు. అందుకే వారు తెరాస వాదనలకు విరుగుడుగా కేసీఆర్‌ కుటుంబంపై అవినీతి ఆరోపణలు, కేసీఆర్‌ నిరంకుశ, అప్రజాస్వామికపాలన గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే వాటితో ప్రజలను ఆకట్టుకోవడం కష్టమే కనుక నిరుద్యోగభృతి, ఒకేసారి పంట రుణాలమాఫీ, పెన్షన్లు పెంపు వంటి ఆకర్షణీయమైన హామీలు కూడా గుప్పిస్తున్నారు. కానీ వాటినన్నిటినీ తెరాస ఎత్తుకుపోయింది. కనుక మహాకూటమి నేతలు తెరాసను ఏవిధంగా ఎదుర్కోంటారో చూడాలి. 


Related Post