ఏపీ సిఎం చంద్రబాబుపై జగన్ కేసు!

October 31, 2018


img

ఇటీవల వైజాగ్ విమానాశ్రయంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై హత్య ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దానిపై ఏపీ పోలీసులు సక్రమంగా దర్యాప్తు జరుపడం లేదని కనుక సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ జగన్ హైకోర్టులో బుదవారం ఒక పిటిషను వేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిజిపి, ఏపీ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున ఏపీ సిట్  ఇంచార్జ్ ఆఫీసర్, వైజాగ్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ.లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జగన్ పిటిషనును స్వీకరించిన హైకోర్టు దానిపై రేపు విచారణ జరిపే అవకాశం ఉంది. 

ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ, ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవాలనే తాపత్రయంతో జగన్, వైకాపా నేతలు వరుసగా తప్పటడుగులు వేస్తున్నట్లున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు తనకు వారి దర్యాప్తుపై ఏమాత్రం నమ్మకం లేదని చెప్పి తిప్పి పంపేసి ఇప్పుడు వారు సరిగ్గా దర్యాప్తు జరుపడం లేదని హైకోర్టులో పిటిషను వేయడం తప్పు అని చెప్పవచ్చు. రేపు కోర్టులో ఈ కేసును విచారించినప్పుడు ఏపీ ప్రభుత్వం తరపు వాదించబోయే న్యాయవాది మొట్టమొదట ఇదే గుర్తు చేసి, పోలీసుల విచారణకు జగన్ సహకరించలేదని తద్వారా చట్టాన్ని ఉల్లంఘించారని వాదించడం ఖాయం. అదే...ఒక సామాన్య పౌరుడు ఈవిధంగా విచారణకు వచ్చిన పోలీసులకు సహకరించబోనని చెప్పలేడు కదా?

జగన్ గత 10 నెలలుగా ఏపీలో 3,221 కిమీ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడా అవాంఛనీయ ఘటన జరుగకుండా ఏపీ పోలీసులు ఆయనను కంటికి రెప్పలా కాపాడారు. కనుక ఈ విషయంలో వారిని, ఏపీ హోంశాఖను, డీజీపీని తప్పు పట్టలేరు. అదేవిధంగా కేంద్రబలగాల పర్యవేక్షణలో ఉండే విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టలేరు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియవనుకోలేము. కానీ హైకోర్టులో పిటిషను వేశారంటే దీని ద్వారా తన పార్టీకి ఎంతో కొంత రాజకీయ మైలేజీ పొందాలని ఆశిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.


Related Post