మహాకూటమికి కాంగ్రెస్‌ హ్యాండ్ ఇవ్వబోతోందా?

October 31, 2018


img

 మహాకూటమికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వబోతోందా?అంటే దాని వైఖరి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకపక్క మహాకూటమిలో మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతూనే మరోపక్క 119 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసుకొని ఆ జాబితాను డిల్లీకి పంపించేయడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మహాకూటమి నుంచి తప్పుకొనే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. 

కనుకనే కాంగ్రెస్ పార్టీ తెగించి రేపు మొదటి జాబితాను ప్రకటించేందుకు సిద్దం అవుతోందనుకోవచ్చు. దానితో మహాకూటమి విచ్చిన్నం అయ్యే ప్రమాదం ఉందని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ముందుకే సాగాలనుకోవడం వెనుక కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

1. కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యవంటి ఈ ఎన్నికలలో గెలవడం చాలా అవసరం. కనుక ప్రతీ ఒక్క సీటు చాలా కీలకమైనదే. కాంగ్రెస్ పార్టీకి మంచి బలముండి, తప్పకుండా గెలుచుకోగలమని భావిస్తున్న స్థానాలను మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వాటికి అప్పగిస్తే అవి ఓడిపోయినట్లయితే, అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే తప్ప మిత్రపక్షాలు కాదు. కనుక ఆ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీయే పోటీ చేసినట్లయితే కాంగ్రెస్‌ విజయావకాశాలు పెరుగుతాయని పార్టీ పెద్దలు భావించడం సహజమే. బహుశః అందుకే సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ మొరాయిస్తోందనుకోవచ్చు.        

2. టిడిపితో దోస్తీ గురించి, మహాకూటమి వెనుక చంద్రబాబునాయుడు ఉన్నారంటూ తెరాస చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. కనుక సీట్ల పంపకాలను ఆలస్యం చేస్తూ టిడిపి దానంతట అదే గుడ్ బై చెప్పేలా చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోందేమో?          

3. ఇక ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌-తెరాస మద్య ముఖాముఖి పోటీ జరిగితేనే కాంగ్రెస్ పార్టీకి మేలు కలుగుతుంది. కానీ టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐ, సిపిఎం, ఇంకా అనేక చిన్న చిన్న పార్టీలు, బిఎల్ఎఫ్ వగైరా బరిలో ఉన్నాయి. కనుక ఓట్ల చీలికను నివారించేందుకు మహాకూటమిని ఏర్పాటుకు సిద్దపడింది. కానీ ఆశించినట్లుగా సీట్ల పంపకాలు సజావుగా జరగడం లేదు. కనుక అనివార్య పరిస్థితులలో మహాకూటమి నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేపు 70 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లయితే మహాకూటమిని గాలికి వదిలేసినట్లే భావించవచ్చు. అప్పుడు మహాకూటమిలో మిత్రపక్షాల స్పందనను చూసి, వీలైతే వాటితో సీట్ల సర్దుబాట్లు చేసుకోవడం లేకుంటే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు తెరాస కూడా మహాకూటమి గురించి ఇంతకాలం చేస్తున్న వాదనలు పక్కనపడేసి, కాంగ్రెస్ పార్టీని ఒక్కదానినీ ఎదుర్కోవడానికి మళ్ళీ సరికొత్త వాదనలు సిద్దం చేసుకోక తప్పదు.


Related Post