ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీకి...రేపే అభ్యర్ధుల ప్రకటన?

October 31, 2018


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బుదవారం హడావుడిగా డిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల క్రితం సమావేశమైన కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ పార్టీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాపై కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించి ఆమోదముద్ర వేయించుకొని నవంబరు 1న కాంగ్రెస్‌ అభ్యర్ధుల తొలిజాబితా ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా చెప్పారు కనుక దాని కోసమే ఆయనను డిల్లీకి పిలిచి ఉండవచ్చు. అయితే తొలి జాబితాలో పార్టీ ముఖ్య నేతలను మాత్రమే ప్రకటించాలని భావించినప్పటికీ, మహాకూటమిలో మిత్రపక్షాలకు కేటాయించాలనుకొంటున్న స్థానాలను, పార్టీలో ఇద్దరు కంటే ఎక్కువమంది అభ్యర్ధులు పోటీ పడుతున్న స్థానాలను పక్కన పెట్టి మిగిలిన 70-73 స్థానాలకు రేపు అభ్యర్ధుల పేర్లను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్టీలో సీనియర్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు కూడా బుదవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం డిల్లీకి బయలుదేరబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఈ హడావుడి చూస్తుంటే రేపు తప్పకుండా తొలి జాబితాను ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.   

కాంగ్రెస్ పార్టీ రేపు తన అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించబోతోందనే వార్తలు వెలువడటంతో మహాకూటమిలో టిడిపి, టిజేఎస్, సిపిఐ నేతలు ఎల్ రమణ, ప్రొఫెసర్ కోదండరామ్, చాడా వెంకటరెడ్డి సమావేశమయ్యి సీట్ల సర్దుబాట్లు, తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. రేపటిలోగా కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకోవాలాని లేకుంటే రేపు తమ కార్యాచరణ ప్రకటించాలని వారు నిర్ణయించుకొన్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపు తన అభ్యర్ధులను ప్రకటించినట్లయితే, కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టి మహాకూటమిలో మిగిలిన మూడు పార్టీలు కలిసి ముందుకు సాగాలని ఆలోచిస్తునట్లు తాజా సమాచారం.


Related Post