మహాకూటమి నేతల చర్చలు ఫలిస్తాయా?

October 31, 2018


img

మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్న టిడిపి, టిజేఎస్, సిపిఐ పార్టీల నేతలు ఎల్ రమణ, ప్రొఫెసర్ కోదండరామ్, చాడా వెంకట రెడ్డి తదితరులు బుదవారం హైదరాబాద్‌లో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ రేపు 38 మంది అభ్యర్ధులతో మొదటిజాబితా విడుదల చేసేందుకు సిద్దమవుతున్నందున, ఈరోజు జరుగుతున్న మహాకూటమి సమావేశం చాలా కీలకంగా భావించవచ్చు. కానీ నేటికీ మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఏ స్థానాల నుంచి పోటీ చేయాలనే దానిపై నాలుగు పార్టీల మద్య ప్రతిష్టంభన నెలకొనే ఉంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లలో పంతాలకు, పట్టుదలకుపోవద్దని, మహాకూటమి గెలుపే ప్రధానమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు గట్టిగా చెప్పడంతో ఈ విషయంలో వారు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు. కానీ టిజేఎస్, సిపిఐ పార్టీలు మాత్రం తమకు పెద్దగా బలం లేని, కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టుండి అది గెలుచుకోగల స్థానాలను కోరుతుండటంతో  ప్రతిష్టంభన ఏర్పడింది. కనుక కాంగ్రెస్ పార్టీ తరపున ఆ రెండు పార్టీల నేతలతో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ సమావేశమయ్యి చర్చిస్తున్నారు. 

ఒకవేళ ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరనట్లయితే రేపు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల మొదటి జాబితా ప్రకటనను వాయిదా వేసుకోవలసిరావచ్చు లేకుంటే తెలంగాణ జనసమితి కూడా తన అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు తమతమ అభ్యర్ధులను ప్రకటించుకొన్నప్పుడు టిడిపి, సిపిఐ పార్టీలు చేతులు ముడుచుకొని కూర్చోలేవు కనుక అవి కూడా తమ అభ్యర్ధులను ప్రకటించవచ్చు. ఇదే జరిగితే మహాకూటమి విచ్చిన్నం అయినట్లే భావించవచ్చు. 

కనుక ఎట్టి పరిస్థితులలో ఇవాళ్ళ మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల చర్చలు ఒక కొలిక్కి రావాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించుకోలేదు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ రేపు తన అభ్యర్ధులను ప్రకటించినట్లయితే ఇక మహాకూటమిపై దానికి ఆసక్తిపోయినట్లే భావించవచ్చు. కనుక ఈరోజు జరుగుతున్న మహాకూటమి సమావేశం చాలా కీలకంగా భావించవచ్చు. 


Related Post