ఎల్ రమణ మంచి ప్రశ్నే వేశారు

October 30, 2018


img

టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ సిఎం కేసీఆర్‌కు మంచి ప్రశ్న వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కంటివెలుగు పధకం అమలుచేస్తున్నప్పుడు, సిఎం కేసీఆర్‌ ఇక్కడ కాంతి పరీక్షలు చేయించుకోకుండా డిల్లీ ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు వద్ద తాకట్టు పెట్టారని విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ ఇప్పుడు చేస్తున్నదేమిటి? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన నరేంద్ర మోడీ దగ్గర ఎందుకు తాకట్టు పెడుతున్నారు? కంటి,పంటి పరీక్షల సాకుతో డిల్లీ వెళ్ళి అక్కడ బిజెపి పెద్దలను రహస్యంగా కలుసుకున్న మాట వాస్తవమా కాదా? చెప్పాలి. అవినీతి సొమ్ముకు నిలయంగా మారిన ప్రగతిభవన్‌ను మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాసుపత్రిగా మార్చి వేస్తాము,” అని అన్నారు. 

తెరాస ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల పనితీరు మెరుగుపరచడానికి అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అన్ని హంగులతో అనేక కొత్త ఆసుపత్రులు నిర్మించింది ఇంకా నిర్మిస్తోంది. ప్రజారోగ్యం కోసం ఉచిత వైద్య పరీక్షలు, కిడ్నీ రోగుల కోసం ఉచిత డయాలసిస్ సెంటర్లు, కళ్ల సమస్యలతో బాధపడుతున్నవారి కోసం కంటివెలుగు వంటి అనేక సంక్షేమ పధకాలు ప్రారంభించి విజయవంతంగా అమలుచేస్తోంది. కానీ ఈ పధకాలన్నిటికీ రూపకల్పన చేసి, అమలుచేయిస్తున్న సిఎం కేసీఆర్‌, సాధారణ కంటి, పంటి పరీక్షల కోసం డిల్లీకి వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అదే... ఆయన కంటివెలుగు పధకంలో పరీక్షలు చేయించుకొని ఉంటే, వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు, ఆ పధకానికి మరింత ఆదరణ లభించి ఉండేది కదా! అయినా దేశవిదేశాల నుంచి అనేకమంది రోగులు హైదరాబాద్‌ వచ్చి క్లిష్టమైన రోగాలకు వైద్య, శస్త్ర చికిత్సలు చేయించుకొని వెళుతుంటే సిఎం కేసీఆర్‌ డిల్లీ వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవడం విచిత్రంగానే ఉంది.


Related Post