మహాకూటమితో కాంగ్రెస్‌ చెలగాటం

October 30, 2018


img

మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చకుండా మిత్రపక్షాలకు కేటాయించబోయే సీట్లు, తమ అభ్యర్ధులు పోటీ చేయబోయే స్థానాల గురించి రోజూ మీడియాకు లీకులు ఇస్తుండటంతో టిడిపి, టిజేఎస్, సిపిఐలు చాలా ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

తాజాగా కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ సోమవారం సమావేశమై తమ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సుదీర్గంగా చర్చలు జరిపి తుది జాబితాను ఖరారు చేసింది. మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు అయినా కాకున్నా నవంబరు 1వ తేదీన 35 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది. నిన్న జరిగిన సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆ తుది జాబితాకు ఆమోదం తెలిపిన తరువాత భక్తచరణ్‌దాస్‌, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు ఆ జాబితాతో డిల్లీ బయలుదేరారు. దానికి తమ అధిష్టానం చేత ఆమోదముద్ర వేయించుకొని డిల్లీలోనే నవంబరు 1న తొలిజాబితాను ప్రకటించబోతున్నారు. 

ఆలోగా మహాకూటమిలో మిత్రపక్షాలతో చర్చలు ముగించి మిగిలిన స్థానాలను కూడా ఖరారు చేయాలని నిర్ణయించుకొన్నారు. అయితే సీట్ల సంఖ్య, ఏఏ నియోజకవర్గాలలో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై ఇంకా ప్రతిష్టంభన నెలకొని ఉన్నందున నవంబరు 1లోగా మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు జరిగే సూచనలు కనబడటం లేదు. ఈ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు సిద్దం అవుతుండటంపై మహాకూటమిలో మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ముఖ్యంగా 15 స్థానాలు కావాలని పట్టుబడుతున్న తెలంగాణ జనసమితి తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఒకవేళ సీట్ల సరుబాట్లు చేయకుండా కాంగ్రెస్ పార్టీ నవంబరు 1న తన తొలిజాబితాను ప్రకటించినట్లయితే, తాము కూడా 15 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అదేకనుక జరిగితే మహాకూటమి ఎన్నికల బరిలో దిగక మునుపే కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. 

నవంబరు 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేయడం మొదలవుతుంది. అంటే ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. కానీ ఇంతవరకు సీట్ల సర్దుబాట్లపై ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ తన స్వంత అభ్యర్ధులను ప్రకటించుకోవడానికి సిద్దం అవుతుండటం చూస్తే, మహాకూటమికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వబోతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


Related Post