బిజెపికి ఇక వేరే అంశమే లేదా?

October 29, 2018


img

కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి దయనీయంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను ముప్ప తిప్పలు పెడుతున్న బిజెపి తెలంగాణలో తెరాసను గట్టిగా ఎదిరించలేని స్థితిలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆ నాలుగు రాష్ట్రాలలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడానికి మోడీ, అమిత్ షాలు చేయని ప్రయత్నం లేదు కానీ త్వరలో ఎన్నికలకు వెళుతున్న తెలంగాణలో అమిత్ షా నిర్వహించే సభలలో కాంగ్రెస్ పార్టీని(జాతీయ స్థాయిలో మాత్రమే), రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించడానికే పరిమితమవడం అందరూ గమనించే ఉంటారు. 

రాష్ట్రంలో చిన్నచిన్న పార్టీలు సైతం రాష్ట్రానికి సంబందించిన పలు సమస్యలపై గట్టిగా మాట్లాడి, తాము అధికారంలోకి వస్తే వాటన్నిటినీ పరిష్కరిస్తామని గట్టిగా చెప్పుకొంటుంటే, బిజెపి మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం అంశానికే పరిమితమవుతుంటుంది. మజ్లీస్ పార్టీకి భయపడే తెరాస  గురించి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అధికారికంగా జరుపుతామని చెపుతుంటారు.

రాష్ట్రంలో బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుందని వాదిస్తున్న బిజెపి నేతలు అందుకు చెపుతున్న కారణం కూడా చాలా విచిత్రంగానే ఉంది. మోడీ అద్భుతమైన పాలనను చూసి తెలంగాణ ప్రజలు రాష్ట్ర బిజెపికి ఓట్లు వేస్తారని చెప్పుకొంటూ ఆత్మవంచన చేసుకొంటున్నారని చెప్పక తప్పదు.

ఇతర రాష్ట్రాలలో అధికార పార్టీలను బలంగా డ్డీ కొంటూ...అధికారం దక్కించుకోవడం కోసం చాలా దూకుడుగా వ్యవహరించే బిజెపి అధిష్టానం తెలంగాణలో మాత్రమే ఎందుకు ఇంత మెతక వైఖరితో వ్యవహరిస్తోందంటే బిజెపి-తెరాసల మద్య రహస్య అవగాహన ఉన్నందునే అని అనుకోవాలేమో? లేదా రాష్ట్ర బిజెపిలో సిఎం కేసీఆర్‌ను డ్డీకొనగల బలమైన నాయకుడు లేకపోవడం, తెరాసకు ప్రజలలో అపూర్వమైన ఆదరణ కలిగి ఉన్నందున ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం అసంభవమని గ్రహించినందునే తెరాస పట్ల మెతక వైఖరి వహిస్తూ తన పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేస్తోందేమో? కానీ రాష్ట్రంలో బిజెపిని సజీవంగా కాపాడుకోవాలనే ప్రయత్నంలో తెరాస పట్ల మెతక వైఖరితో వ్యవహరిస్తూ రాష్ట్ర బిజెపిని చేజేతులా చంపుకొంటోందని చెప్పక తప్పదు.

ఈసారి ఎన్నికలలో బిజెపి తన రెండు సీట్లు గెలుచుకొంటే అదే చాలా గొప్ప విషయమని సిఎం కేసీఆర్‌ అన్నారంటే బిజెపి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందా లేదా అనే విషయం పక్కన బెడితే, బిజెపి అధిష్టానం వైఖరి రాష్ట్రంలో బిజెపికి శాపంగా మారిందని చెప్పవచ్చు. అది ఈ ఎన్నికల తరువాత రుజువు కాబోతోంది.


Related Post