అమిత్ షా చెప్పింది నిజమే

October 29, 2018


img

సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం బిజెపి యువసమ్మేళనం సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, “జాతీయస్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని రాహుల్ బాబా (రాహుల్ గాంధీ) కలలు కంటున్నారు. కానీ ఆ కూటమిలో పార్టీలు ఆయనను నాయకుడుగా అంగీకరించనప్పుడు ఆయన ప్రధానమంత్రి ఎలా కాగలుగుతారు? అధికారం చేజిక్కించుకోవడం కోసమే ఒక నీతి, నియమం, సిద్దాంతం ఏవీ లేకుండా మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి కూటములు ఎన్ని వచ్చినా మా పార్టీని ఏమీ చేయలేవు. వచ్చే లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి అదృశ్యం కాబోతోంది. ప్రధానమంత్రి కావాలనే రాహుల్ గాంధీ కలలు ఎన్నటికీ నెరవేరవు,” అని అన్నారు. 

జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ నేతృత్వంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పాటు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రధానమంత్రి పదవి ఆశిస్తున్న మాయావతి, మమతా బెనర్జీ, ములాయం సింగ్ వంటి సీనియర్ నేతలు డజనుకుపైగా ఉన్నారు. వారి మద్దతుతో మహాకూటమి ఏర్పాటు చేస్తున్నప్పుడు, సహజంగానే వారందరూ ప్రధానమంత్రి పదవికి పోటీ పడవచ్చు. వారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకొన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి వేరే ఏదైనా కీలక పదవితో సర్ధుకుపోక తప్పదు. అందుకు రాహుల్ గాంధీ కూడా సంసిద్దత వ్యక్తం చేశారు కనుక ఒకవేళ మహాకూటమి ఎన్నికలలో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, అమిత్ షా చెప్పినట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. 

ఒకవేళ ఎన్నికలకు ముందుగానే మహాకూటమి ప్రధానమంత్రి అభ్యర్ధి పేరు ప్రకటించి, అందుకు అన్ని పార్టీలు కట్టుబడి ఉంటామని ప్రకటించినట్లయితే, వచ్చే లోక్ సభ ఎన్నికలలో బిజెపికి గట్టి పోటీ ఈయవచ్చు. తెలంగాణలో మహాకూటమికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు ఇప్పుడే ప్రకటించగలిగితే, ప్రజలకు దానిపై నమ్మకం ఏర్పడుతుంది. కానీ తెలంగాణ శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో మహాకూటమి ఓడిపోయినట్లయితే,   అమిత్ షా, సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లుగా మళ్ళీ వచ్చే ఎన్నికలనాటికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడే బలపడగలుగుతాయి. ఏళ్ళ తరబడి ప్రతిపక్షంలో కూర్చోంటే ఆ పార్టీలో నేతలకు, కార్యకర్తలకు ఎవరి అండదండలు లభించవు కనుక అధికారంలో ఉన్న పార్టీలవైపు ఆకర్షితులవుతారు. 


Related Post