అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే...నా?

October 29, 2018


img

మహాకూటమిలో పార్టీల మద్య సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ-89, టిడిపి-15, టిజేఎస్-10, సిపిఐ-5 స్థానాలను పంచుకొన్నట్లు తాజా సమాచారం. అంటే టిజేఎస్ చివరికి తన పంతం నెగ్గించుకోగలిగిందని అర్దమవుతోంది. అయితే ఈసారి ఎన్నికలలో తెరాస 110 సీట్లు గెలుచుకొంటామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, తెలంగాణ జనసమితికి 10 స్థానాలు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానమేనని చెప్పవచ్చు. ఎందుకంటే, అధికార తెరాస అభ్యర్ధులలో దాదాపు అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. వారిలో మంత్రులు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ ప్రజలకు చిరపరిచితులే. పైగా వారి వెనుక కొండంత అండగా సిఎం కేసీఆర్‌ ఉన్నారు. అంత బలమైన తెరాస అభ్యర్ధులతో పోటీపడి ఓడించగలవారు తెలంగాణ జనసమితిలో ఎందరున్నారు అంటే ఒక్క ప్రొఫెసర్ కోదండరామ్ ఒక్కరే కనిపిస్తున్నారు. 

ఒకవేళ మరో రెండు మూడు స్థానాలలో టిజేఎస్ అభ్యర్ధులు గెలిచినా, మిగిలిన 7-8 సీట్లు తెరాస ఖాతాలోనే జమా అవడం ఖాయం. టిజేఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో కొమ్ములు తిరిగిన అనేకమంది బలమైన అభ్యర్ధులున్నారు. వారు తెరాస అభ్యర్ధులను ఓడించగలరా లేదా అనే విషయం పక్కన పెడితే, తప్పకుండా తెరాసను బలంగా డ్డీ కొనగలరు. కానీ పొత్తులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారిని పక్కన పెట్టి టిజేఎస్ కు సీట్లు ఇవ్వవలసి వచ్చింది. కనుక దీని వలన అంతిమంగా కాంగ్రెస్ పార్టీయే నష్టపోయేనని భావించవచ్చు. 

ఇక కాంగ్రెస్ పార్టీ 89 స్థానాలలో పోటీ చేయబోతోంది. ఒకవేళ వాటిలో కాంగ్రెస్ పార్టీ 30-40, టిడిపి 2-4, టిజేఎస్ 1, సిపిఐ 2 స్థానాలు  మాత్రమే గెలుచుకొన్నట్లయితే, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజార్చుకొన్నట్లవుతుంది. ఈవిధంగా ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుంది కానీ ఈసారి ఎన్నికలలో పోటీ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈవిధంగా జరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. 

అదే కాంగ్రెస్ పార్టీ 95 స్థానాలలో పోటీ చేస్తే దానికి మరికొన్ని సీట్లు గెలుచుకొనే అవకాశం ఉండేవి కనుక దాని విజయావకాశాలు కూడా పెరిగి ఉండేవి. ఇక సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లుగా ఈసారి ఎన్నికలలో తెరాస ప్రభంజనం సృష్టించేమాటయితే, మహాకూటమిలో ఈ సీట్ల కేటాయింపుల కారణంగానే తెరాస మరింత సునాయసంగా విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు.


Related Post