డ్రగ్స్ కేసులపై విచారణ ఎందుకు నిలిపివేశారు? రేవంత్‌రెడ్డి

October 27, 2018


img

గత ఏడాది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తెలుగు సినీ ప్రముఖుల మాదకద్రవ్యాల కేసులను తెరాస ప్రభుత్వం మెల్లగా అటకెక్కించేసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. వాటిలో కేసీఆర్‌ బందువుల పేర్లు కూడా ఉన్నందునే వాటిని అటకెక్కించేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అకున్ సభర్వాల్ సిద్దం చేసిన నివేధికను బయటపెట్టినట్లయితే కేసీఆర్‌ బందువుల పేర్లు బయటకు వస్తాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

మంత్రి కేటిఆర్‌ బామ్మర్ధి రాజ్‌ పాకాలకు చెందిన ‘ఈవెంట్స్ నౌ’ అనే సంస్థ మ్యూజికల్ నైట్స్ ముసుగులో మత్తుమందులు, డేటింగ్ క్లబ్ పేరుతో యువతులతో వ్యాపారం కూడా చేస్తోందని రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. అధ్వర్యంలో శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్ ఈవెంట్’ పేరిట మ్యూజికల్ నైట్ నిర్వహిస్తోందని, దానిలో మత్తుమందు అమ్మకాలు, కొత్త డీలర్ల నియామకాలు జోరుగా సాగుతాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ముంబై, గోవా, పూణే నగరాలలో ఇటువంటి కార్యక్రమాలపై నిషేధం అమలులో ఉండగా, కేసీఆర్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎందుకు అనుమతీస్తోందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాలు, వాటి డీలర్లు మళ్ళీ  ఎప్పుడూ కనబడకుండా చేస్తానని ప్రగల్భాలు పలికి సిఎం కేసీఆర్‌ ఈ మ్యూజికల్ నైట్ పేరిట సాగబోయే మాదకద్రవ్యాల అమ్మకాలకు ఎందుకు అనుమతిస్తున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిని ఎన్నికల సంఘం అడ్డుకోవాలని లేకుంటే తన నేతృత్వంలో యువ కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి వెళ్ళి ‘మ్యూజికల్ నైట్స్’ కార్యక్రమాన్ని అడ్డుకొంటామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.


Related Post