నర్సారెడ్డికి మెదక్ టికెట్?

October 27, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఈసారి శాసనసభ ఎన్నికలలో తాను పోటీ చేయబోవడంలేదని కొన్ని రోజుల క్రితమే సంచలన ప్రకటన చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెకు పోటీ చేయాలనే ఆలోచనే ఉన్నట్లయితే, ఆమె అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆమెకు తప్పకుండా టికెట్ ఇచ్చి ఉండేది. కానీ ఇంకా అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేయక మునుపే ఆమె తాను ఎన్నికలలో పోటీ చేయదలచుకోలేదని ప్రకటించేశారు.

సీనియర్ తెరాస నేత నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడానికి ఆమె స్వయంగా ప్రయత్నాలు చేయడమే కాకుండా ఆయనకు మెదక్ నుంచి శాసనసభకు టికెట్ ఇప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నర్సారెడ్డికి టికెట్ ఇప్పించడం కోసమే ఆమె ఈ త్యాగానికి సిద్దపడ్డారా లేక లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొన్నారో తెలియదు కానీ ఈ సంగతి తెలుసుకొని ఆ టికెట్ ఆశిస్తున్న సీనియర్ కాంగ్రెస్‌ నేతలు సుప్రభాత్‌రావు, బట్టి జగపతి, చంద్రపాల్‌ తదితరులు మొదట పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ తరువాత ఆమెను కలిసి మెదక్ నుంచి విజయశాంతి పోటీ చేయాలని లేకుంటే తమలో ఎవరో ఒకరికి ఆ టికెట్ ఇవ్వాలని అభ్యర్ధించారు. తమను కాదని ఈరోజు కొత్తగా పార్టీలో చేరిన నర్సారెడ్డికి మెదక్ సీట్ కేటాయించడం భావ్యం కాదని వారు సున్నితంగా విజయశాంతికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ నర్సారెడ్డికె మెదక్ టికెట్ ఇస్తే వారు అసంతృప్తి చెందితే ఆశ్చర్యం లేదు. మరి మెదక్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో చూడాలి.


Related Post