ఆ వార్తలు నిజం కావు: తుల ఉమ

October 27, 2018


img

కరీంనగర్‌ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ తెరాసలో సీనియర్ నేతలలో ఒకరు. కనుక ఈసారి వేములవాడ నుంచి శాసనసభకు పోటీ చేయాలని ఆశపడి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సిఎం కేసీఆర్‌ వేములవాడ టికెట్ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కే ఇవ్వడంతో ఆమె బాధ పడ్డారు. ఆ కారణంగా ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి మారబోతున్నారని మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి.

వాటిపై స్పందించిన ఆమె, “నేను వేములవాడ నుంచి టికెట్ ఆశించడం, అది దక్కకపోవడం నిజమే కానీ ఆ కారణంగా నేను తెరాసను వీడుతానని వస్తున్న వార్తలలో నిజం లేదు. గిట్టనివారెవరో నాపై ఈవిధంగా మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పటికీ తెరాసలో ఉంటాను,” అని స్పష్టం చేశారు.

కానీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు, ఆమె అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయకపోతే మీడియాలో ఆవిధంగా వార్తలు వచ్చేవే కావు కదా? ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడానికి స్థానిక కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె టికెట్ ఇవ్వకపోయినా తెరాసనే అంటిపెట్టుకొని ఉంటారో లేక టికెట్ లభిస్తే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తారో మహాకూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యి, అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తే తేలిపోతుంది.


Related Post