జగన్ మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకొన్నారా లేక...

October 27, 2018


img

వైజాగ్ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి ఏపీ రాజకీయాలలో హటాత్తుగా వేడి పెంచాయి. అయితే ఈ ఘటనపై జగన్, ఆయన పార్టీ నేతల వైఖరితో సెల్ఫ్ గోల్ చేసుకొంటున్నారా లేక దీంతో చంద్రబాబు నాయుడు చెప్పుకొంటున్నట్లు ఆయన ఛాప్టర్ క్లోజ్ చేసేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనను జగన్, వైకపా నేతలు బాగా హైలైట్ చేయడంలో సఫలం అయ్యారనడంలో అనుమానం లేదు. దీని గురించి జాతీయస్థాయి వరకు పాకిపోయింది. ఈ అవకాశాన్ని వైకాపాకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆ పార్టీ నేతలు బాగానే ప్రయత్నించినప్పటికీ, జగన్, వైకాపా నేతలు కొన్ని తప్పటడుగులు వేయడంతో ఈ కధ అనూహ్య మలుపులు తిరుగుతోంది. 

ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఏపీ పోలీసులు జగన్ వాంగ్మూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు, తనకు వారి దర్యాప్తుపై నమ్మకం లేదని చెప్పి తిప్పి పంపేయడం ఒక పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నప్పుడు, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఏపీ పోలీసులను కాక మరెవరిని ఉపయోగించుకొంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

 అలాగే విమానాశ్రయంలోపల జరిగిన ఈ ఘటనను టిడిపికి, చంద్రబాబు నాయుడు ముడిపెట్టి  వైకాపా నేతలు దీనిపై ఆందోళనలకు సిద్దం అవడం వంటివి బెడిసికొట్టినట్లే ఉన్నాయి. పైగా ఏపీ బీజేపీ నేతలు ఈ వ్యవహారంలో వేలుపెట్టి అత్యుత్సాహం ప్రదర్శించడం వలన చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.            

దీనితో వైకాపా నేతలు మంచి రాజకీయ మైలేజి పొందాలని గట్టిగానే ప్రయత్నించినప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా అంతే చురుకుగా స్పందించి వైకాపా ఎత్తులను కట్టడి చేయగలిగారని చెప్పవచ్చు. ముందుగా జగన్ పై దాడి చేసిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్, వైకాపా వీరాభిమానులని, జగన్ పట్ల ప్రజలలో సానుభూతి పెంచడానికే ఈ డ్రామా ఆడానని శ్రీనివాస్ చేతే మీడియాకు చెప్పించడం ద్వారా టిడిపి ఈ ఘటనకు ఊహించని ట్విస్ట్ ఇవ్వగలిగిందని చెప్పవచ్చు. 

అక్కడితో ఆపేస్తే ఈ కధ ఎలా సాగేదో కానీ చంద్రబాబు నాయుడు అక్కడే తన రాజకీయ అనుభవం ఉపయోగించారు. దీంతో వైకాపా ఏవిధంగా ప్రజలలో సానుభూతి సంపాదించుకోవాలని ప్రయత్నించిందో, చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా సానుభూతి సంపాదించుకోవడానికి చాలా తెలివిగా వ్యవహరించారు. 

తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే కేంద్ర ప్రభుత్వం డైరక్షనులో ఈ నాటకం జరిగిందని గట్టిగా వాదించారు. జగన్ వీరాభిమాని అయిన శ్రీనివాస్ కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయంలో జగన్ పై సున్నితంగా దాడి చేయడం, దాడి జరిగిన వెంటనే జగన్ హైదరాబాద్‌ వెళ్లిపోవడం, అక్కడ తెరాస మంత్రులు, ఓ కేంద్రమంత్రి పరామర్శలు చేయడం, గవర్నర్ నరసింహన్ తనతో (చంద్రబాబు నాయుడుతో) మాట్లాడి వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా నేరుగా డిజిపికి ఫోన్ చేసి కనుక్కోవడం వంటివన్నీ ఆ కుట్రలో భాగమేనని చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు గట్టిగా వాదిస్తూ, ఒకపక్క వైకాపాను కట్టడి చేస్తూనే మరోపక్క రాష్ట్ర ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. 

అలాగే ఈ ఘటననే కేంద్రంపై బ్రహ్మాస్త్రంగా సందించేయత్నంలో చంద్రబాబు నాయుడు ఇవాళ్ళ డిల్లీ వెళ్ళి అక్కడ మీడియా సమావేశం పెట్టి, ప్రధాని మోడీ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏవిధంగా కుట్రలు పన్నుతున్నారో వివరించబోతున్నారు. తరువాత డిల్లీలో ఏమవుతుందో అనే విషయం పక్కనబెట్టి చూసినట్లయితే, ఈ రాజకీయ చదరంగంలో జగన్, వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి సెల్ఫ్ గోల్ చేసుకోగా, చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి పైచేయి సాధించినట్లే ఉన్నారు. 


Related Post