టిడిపికి హోం, నీటి పారుదల: మంత్రి హరీష్ రావు

October 26, 2018


img

మంత్రి హరీష్ రావు శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌, టిడిపిలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత టిడిపిని రాష్ట్రం నుంచి తరిమికొడితే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దానిని తీసుకువచ్చి మన నెత్తిన పెట్టబోతోంది. ఒకవేళ మహాకూటమి పొరపాటున అధికారంలోకి వస్తే, టిడిపి హోంమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇవ్వాలని ముందే కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకొంది. హోంశాఖ చేతిలో ఉంటే ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడేందుకు, నీటిపారుదల శాఖ చేతిలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఎండబెట్టేసి ఆంధ్రాకు నీళ్ళు తరలించుకు పోవడానికి సాధ్యం అవుతుందని చంద్రబాబు నాయుడు ఆలోచన. కనుక మహాకూటమికి ప్రజలందరూ గట్టిగా బుద్ది చెప్పాలి,” అని అన్నారు. 

మహాకూటమి అధికారంలోకి వస్తే టిడిపి నేతలకు మంత్రిపదవులు లభించడం ఖాయమే కానీ అంతమాత్రన్న వారు తమ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తారనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ తెరాస నేతలు వాదిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారు అటువంటి ప్రయత్నాలు చేసినా, మహాకూటమిలో తెలంగాణ శ్రేయోభిలాషి ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు వారిని అడ్డుకోకుండా ఉండరు. అటువంటి ప్రయత్నాలే చేస్తే కాంగ్రెస్‌, తెరాస నేతలు చేతులు ముడుచుకొని కూర్చోరు కదా? తెరాస నేతలు మహాకూటమి పట్ల ప్రజలలో అపనమ్మకం, అనుమానాలు రేకెత్తించి ఎన్నికలలో దెబ్బ తీసేందుకే  తమ ఊహలను వాస్తవాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పక తప్పదు.

అయినా ఈసారి ఎన్నికలలో 110 సీట్లు గెలుచుకోబోతున్నామని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, తమ చేతిలో ఓడిపోబోతున్న కాంగ్రెస్‌, టిడిపిలు మంత్రిపదవులు పంచుకొంటే వినోదంగా భావిస్తే సరిపోతుంది కదా? పదేపదే మహాకూటమి నామస్మరణ చేయడం ఎందుకు? తెరాస అభద్రతాభావానికి గురవుతోందని ఆక్షేపించేందుకు తమ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వడం దేనికి?


Related Post